హైదరాబాద్, నవంబర్ 16 ( నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వం ప్రెస్‌కౌన్సిల్ ఆఫ్ ఇండియాను నిర్వీర్యం చేసేందుకు అడుగులు వేస్తున్నదని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతీసాగర్ విమర్శించారు. ప్రెస్‌కౌన్సిల్ పాలకవర్గాన్ని రెండేండ్లుగా ఉద్దేశపూర్వకంగానే నియమించడంలేదని మండిపడ్డారు. పత్రికా స్వేచ్ఛ, నైతికత, జవాబుదారీతనం, బాధ్యతలు మెరుగుపడేందుకు, మీడియా తప్పు చేస్తే చర్యలు తీసుకునేందుకు ప్రెస్‌కౌన్సిల్ దోహదపడుతుందని చెప్పారు. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పేరును మీడియా కౌన్సిల్ ఆఫ్ ఇండియాగా మార్చాలని సూచించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం, మీడియా అకాడమీ, జర్నలిస్ట్ సంఘాలు కేంద్రంపై ఒత్తిడి పెంచాలని కోరారు.
హైదరాబాద్‌లోని తెలంగాణ మీడియా అకాడమీ ఆడిటోరియంలో సమాచార, పౌరసంబంధాలశాఖ, మీడియా అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ పత్రికా దినోత్సవంలో మారుతీసాగర్ మాట్లాడుతూ.. ప్రభుత్వాలు తీసుకునే కర్ర పెత్తనపు నిర్ణయాలు.. జర్నలిజానికి నియమ నిబంధనలు కాలేవని స్పష్టంచేశారు. మీడియా స్వేచ్ఛకు ప్రెస్‌కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిర్ణయాలే ప్రామాణికమని తేల్చిచెప్పారు. మీడియా రంగంలో సంస్కరణలు తీసుకురావటానికి, మీడియాపై దాడులను అరికట్టాడానికి మీడియా సంస్థలు, జర్నలిస్టు సంఘాలు ఏకతాటిపైకి రావాలని సూచించారు. సోషల్ మీడియా నియంత్రణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చట్టపరమైన మార్గదర్శకాలు రూపొందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐఅండ్‌పీఆర్ అడిషనల్ డైరెక్టర్ డీఎస్ జగన్ అధ్యక్షత వహించగా సీనియర్ ఎడిటర్ దేవులపల్లి అమర్, పాత్రికేయ సంఘాల నేతలు బసవ పున్నయ్య, రమణకుమార్, మాజిద్, రమణారావు, రంగసాయి, యూసుఫ్‌బాబు, నవీన్‌కుమార్ యారా, సువర్ణ తదితరులు పాల్గొన్నారు.