హైదరాబాద్, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ): ఆర్టీసీలో పనిచేస్తున్న డ్రైవర్లు, కండక్టర్లపై దాడులు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎంప్లాయీస్ యూనియన్ డిమాండ్ చేసింది. కొన్ని సందర్భాలలో మహిళలు డ్రైవర్, కండక్టర్లపై చేయి చేసుకోవడం పరిపాటిగా మారిందని శుక్రవారం ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేసింది. ఈ మేరకు బస్సులో ప్రయాణిస్తున్న పురుషులు తమకు సీట్ లేదన్న కారణంతో దూషిస్తున్న ఘటనలు తమ దృష్టికి వస్తున్నాయని ఈయూ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్ బాబు, ఈదురు వెంకన్న తెలిపారు. స్టేజీలు లేనిచోట కూడా ఆపడం లేదనే సాకుతో దాడులు చేస్తున్నారని, ఇది మరీ దారుణమని మండిపడ్డారు. ఆర్టీసీ యాజమాన్యం సిబ్బందికి విధి నిర్వహణలో రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.