అడుగు తీసి అడుగేస్తే కేసు! నోరు తెరిస్తే కేసు.. నిరసన తెలిపితే కేసు! ప్రజల తరఫున నిలబడితే కేసు! పాలనావైఫల్యాలు ఎండగడితే కేసు!.. పరామర్శకు పోయినా కేసు!.. కండ్లముందు ఇండ్లు కోల్పోయి కడుపుమండి తిట్టిన వారి మీదా కేసు!.. ఆవీడియోలు పోస్టు చేసిన మీడియాపైనా కేసు! సోషల్ మీడియాలో ప్రజాసమస్యలు ప్రస్తావిస్తే కేసు! సీఎంను విమర్శిస్తే కేసు.. సీఎం పేరు మరిచిపోయినా కేసు! ఒక్కో రంగాన్ని టార్గెట్ చేసి, కక్షగట్టి అందులోని ప్రముఖుల మీదా కేసు! అక్రమ కేసులపై ఆందోళన చేస్తే దానిపైనా కేసు! మాట తప్పిన కాంగ్రెస్ నాయకుల ఫ్లెక్సీలను ఫినాయిల్‌తో కడిగినా కేసే!కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసినా కేసే! ఎందుకు పెట్టారో, ఏ సెక్షన్లు వర్తిస్తాయో అనవసరం. ప్రభుత్వం పెట్టమంటున్నది. పోలీసులు పాటిస్తున్నరు. అంతే!
దేశమంతా అంబేద్కర్ రాజ్యాంగం అమలవుతుంటే.. రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ అమలవుతున్నది. పోలీసుల ద్వారా ప్రభుత్వం దాదాపు యుద్ధం చేసినట్టుగా అణచివేతను అమలు పరుస్తున్నది. పెరుగుతున్న వ్యతిరేకతను, ప్రజల అసహనాన్ని కేసులతో కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నది. 15 నెలల పాలనలో అటు ఆశా వర్కర్ల నుంచి నిరుద్యోగుల వరకు.. విద్యార్థుల నుంచి మాజీ సర్పంచుల దాక.. లాఠీ దెబ్బలు తినని వారెవరైనా ఉన్నరా? మీడియా ప్రతినిధుల నుంచి సోషల్ మీడియా కార్యకర్తల వరకు కేసులు రుచిచూడని వారెవరైనా మిగిలారా?
Congress Govt | హైదరాబాద్, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ): పదహారు నెలల పాలనలో రాష్ట్రమంతా తీవ్ర నిర్బంధం అమలవుతున్నది. అన్ని వర్గాలపై అణచివేత పెరిగింది. ప్రభుత్వాన్ని ఎవరు ప్రశ్నించినా కేసులు నిత్యకృత్యం అయ్యాయి. ప్రభుత్వ పెద్దల్లో పెరుగుతున్న అసహనానికి పెరుగుతున్న కేసుల సంఖ్యే ఉదాహరణగా నిలుస్తున్నది. స్వాతంత్య్రం వచ్చిన నాటినుంచి ఇప్పటిదాక ఇంత తక్కువ కాలంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ మీద ఇన్ని కేసులు పెట్టిన సర్కారు దేశ చరిత్రలో లేదు. ఇన్ని సెక్షన్ల కింద కేసులు ఎదుర్కుంటున్న పార్టీ బీఆర్ఎస్ కాకుండా మరొకటి లేదు. అయినా దగా పడిన ప్రతివర్గం తరఫునా గులాబీ సేన గొంతెత్తుతూనే ఉన్నది. నిరంకుశానికి ఎదురొడ్డి గర్జిస్తూనే ఉన్నది. మూసీ విధ్వంసాలైనా.. లగచర్ల లడాయి అయినా.. సెంట్రల్ వర్సిటీ భూ పందేరమైనా ఢీ అంటే ఢీ అంటూ బరిగీసి నిలబడుతున్నది బీఆర్ఎస్ ఒక్కటే! సర్కారు వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ, అణచివేతల ప్రభుత్వాన్ని ప్రజాకోర్టులో నిలబెడుతున్నది గులాబీ జెండానే! నిర్బంధాలెన్ని ఎదురైనా నిలదీసి పోరాడుతున్నది బీఆర్ఎస్ దండు ఒక్కటే! కేసులు, హత్యలు, దాడులు, దౌర్జన్యాలు, దారుణాలకు వెరవకుండా ముందుకు సాగుతున్నది కేసీఆర్ సైనికులే!!
ప్రజాస్వామ్యంలో ప్రజలు, ప్రతిపక్షాల ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్య త సర్కారుది. కానీ, ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకుండా, ప్రశ్నలకు బదులివ్వకుండా పోలీసులను అడ్డం పెట్టుకుని ప్రజా పోరాటాలను ఉక్కుపాదంతో అణచివేసేలా నియంతృత్వ ధోరణిని అనుసరిస్తున్నది. కాంగ్రెస్ 16 నెలల పాలనలో బీఆర్ఎస్ నేతలను లక్ష్యంగా చేసుకుని వరుస కేసులు నమోదు చేస్తున్నది.బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ నుంచి.. క్షేత్రస్థాయి కార్యకర్త వరకు ‘బీఆర్ఎస్ నాయకుడు’ అనే పేరు అటు కాంగ్రెస్ నేతలకు, ఇటు పోలీసులకు వినబడినా, ఫిర్యా దు కాపీలో ‘బీఆర్ఎస్’ అని కనబడినా చాలు ‘ఏయ్.. వీడిపై కేసు బుక్ చెయ్. నాన్ బెయిలబుల్ పెట్టు’ ఇవే మాటలు పోలీసు స్టేషన్లలో వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ నేతల చేతిలో దాడు లు, వేధింపులకు బలైన బీఆర్ఎస్ నాయకులు పోలీస్‌స్టేషన్‌కు వెళ్తే ఉల్టా కేసులు బనాయిస్తున్నారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా వేలాది ఉదాహరణలు ఉన్నాయి. బీఆర్ఎస్ జెండా పట్టినా, ఫ్లెక్సీ కట్టినా కార్యకర్తలకు జైలు తప్పడం లేదు. కేసీఆర్ ఫొటోకు క్షీరాభిషేకం చేసినా కాంగ్రెస్ సర్కారు కక్షగడుతున్నది. నిరసనకు పిలుపునిస్తే గృహనిర్బంధాలు, కఠిన ఆంక్షలు అన్నట్టుగా ఉక్కుపాదం మోపుతున్నది. పోలీసు పదఘట్టనలతో పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా ఎక్కడ చూసినా నిర్బంధం రాజ్యమేలుతున్నది. రాజ్యాంగం కల్పించిన భావప్రకటనా స్వేచ్ఛతో ఆవేదన, ఆక్రందన వెల్లగక్కినా అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నది.
నిజాన్ని పోస్టు చేసినా తప్పేనా?
జనగామ జిల్లా పాలకుర్తికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు చింత రవి.. వాట్సాప్‌లో ఓ పోస్ట్ పెట్టాడు. బీఆర్ఎస్ హయాంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి మంజూరు చేసిన నిధులతో ప్రారంభించిన పనులకు ప్రస్తుత ఎమ్మెల్యే యశస్వినీరెడ్డి అత్త ఝాన్సీరెడ్డి మళ్లీ శంకుస్థాపన చేయడం ఏమిటని ప్రశ్నించాడు. కాంగ్రెస్ నేతల ఫిర్యాదుతో రవితో పాటు మరో 8 మం దిపై పోలీసులు కేసు పెట్టారు. కామారెడ్డిగూడెంలో చింత రవి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేశాడు. కాంగ్రెస్ నేతల ఒత్తిడితో దాన్ని తొలగించేందుకు పోలీసులు ప్రయత్నించారు. నిరసన తెలిపిన రవితో పాటు మరికొంతమందిపై మరో కేసు బుక్ చేశారు.
ఏ అధికారంతో ఆదేశాలిచ్చారు?
2025 జనవరి18న సిద్దిపేట జిల్లా దుబ్బాకలో కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమాల్లో కాంగ్రెస్ నాయకుడు చెరుకు శ్రీనివాస్‌రెడ్డి ప్రొటోకాల్ పాటించకుండా సభావేదికపై కూర్చున్నాడు. బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులపై దురుసుగా ప్రవర్తించాడు. శ్రీనివాస్‌రెడ్డిపై చర్య లు తీసుకోవాలని బీఆర్ఎస్ కార్యకర్తలు నిరసన తెలిపారు. కార్యక్రమం ముగిసిన తర్వాత చెరుకు శ్రీనివాస్‌రెడ్డి భూంపల్లి పోలీసు స్టేషన్ కు వెళ్లి బీఆర్ఎస్కు చెందిన 15 మంది నాయకులపై కేసు పెట్టించాడు.
పంచాయితీ పెద్దగా వెళ్లినందుకు వరంగల్‌కు చెందిన బీఆర్ఎస్ కార్పొరేటర్ మరుపల్ల రవి.. ఇద్దరు అన్నదమ్ముల భూమి పంచాయితీకి పెద్దగా వెళ్లాడు. అక్కడ కాంగ్రెస్ నాయకులు రవిపై దురుసుగా ప్రవర్తించారు. తమను కులం పేరుతో రవి దూషించాడని, చంపుతానని బెదిరించాడని ఆరోపిస్తూ అరవింద్ అనే వ్యక్తి ఫిర్యాదు చేయగా మిల్స్‌కాలనీ పోలీసులు అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఈ కేసులో రవిని రిమాండ్‌కు పంపించగా, ఇటీవల బెయిల్‌పై విడుదలయ్యాడు.
గాంధీభవన్‌లోనే కేసులు ఫైల్?
కాంగ్రెస్ పాలకులు పాలనపై దృష్టి పెట్టకుం డా బీఆర్ఎస్లో ఎవరిని వేధిద్దాం?, ఎవరిని అరెస్టు చేయిద్దాం? అనే ఆలోచనలోనే మునిగిపోయినట్టు స్పష్టమవుతున్నది. పోలీసులు సైతం కాంగ్రెస్ నాయకులు ఏది చెప్తే అదే అ న్నట్టుగా తలూపుతున్నారు. చట్టం, న్యాయం ఏమీ చూడకుండా నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేస్తున్నారు. కాంగ్రెస్ నాయకుల క నుసన్నల్లోనే కేసులు నమోదవుతున్నాయని, పోలీసులు గాంధీభవన్‌లో కూర్చుని ఎఫ్ఐఆర్లు రాస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎవరిపై ఏయే సెక్షన్ల కింద కేసులు పెట్టాలో కూడా గాంధీభవన్ నుంచే ఆదేశాలిస్తున్నట్టు తెలుస్తున్నది. ఎక్స్ వేదికగా సీఎం రేవంత్‌రెడ్డిని ప్రశ్నించిన బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్‌పై పోలీసులు 10కి పైగా కేసులు, డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ కొణతం దిలీప్‌పై 11 కేసులు పెట్టారు. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌పై మంచిర్యాలలో కేసులు పెట్టారు. జోగినపల్లి సంతోశ్‌కుమార్ (1) మల్లారెడ్డి (1), క్రాంతి కిరణ్ (1)పైనా వివిధ అభియోగాలతో కేసులు నమోదు చేశారు.
బాధితుడిపైనా బనాయింపు
ములుగు జిల్లా ఇంచర్లలో 2024 మార్చి 30న బీఆర్ఎస్ నాయకుడు మామిడి అశోక్ తోపాటు ఆయన కుటుంబ సభ్యులపై కాం గ్రెస్ నాయకుడు శానబోయిన అశోక్ కత్తితో దాడికి పాల్పడ్డాడు. బాధితుడు ములుగు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు దాడి చేసిన వ్యక్తితోపాటు తనపైనా హత్యాయత్నం కేసు నమోదు చేశారు.
తడి బట్టలతో ర్యాలీ తీసినా..
పెద్దపల్లి జిల్లా రామగుండంలో బూడిద రవాణా కాంట్రాక్టర్ నుంచి బీఆర్ఎస్ నాయకులకు డబ్బులు అందుతున్నాయని కాంగ్రెస్ నాయకులు ఆరోపణ చేశారు. ఇవి అవాస్తవమని ప్రమాణం చేస్తూ మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, నాయకులు చందర్, కౌశిక్ హరి, నడిపల్లి అభిషేక్‌రావు, బొడ్డు రవీందర్, సంధ్యారెడ్డి, కృష్ణవేణి, కిరణ్, అచ్చే వేణు, నూతి తిరుపతి, కుమ్మరి శ్రీను పోచమ్మ గుడివద్ద స్నానం చేసి, తడి బట్టలతో ర్యాలీ తీశారు. అలా చేసినందుకు పోలీసులు కేసు పెట్టారు.
ఆలయం వద్ద జెండాలు వద్దన్నందుకు..
2023 డిసెంబర్ 18న మెదక్ జిల్లా చిలిపిచెడ్ మండలం రాందాస్‌గూడలో ఆలయానికి ఆనుకొని కాంగ్రెస్ జెండాలు ఎందుకు పెట్టారని బీఆర్ఎస్ నాయకులు అంకం యాదగిరి, వెంకట్‌రెడ్డి అడిగారు. దీంతో కాంగ్రెస్ నాయకులు ఘర్షణకు దిగారు. అనంతరం నర్సాపూర్ కాంగ్రెస్ నాయకుల ఫిర్యాదు మేరకు యాదగిరి, వెంకట్‌రెడ్డి, మధు, పండరి, సత్యనారాయణ, విజేందర్, గోపాల్, సుధాకర్‌పై కేసు నమోదుచేశారు. వీరంతా ఒక రోజు సంగారెడ్డి జైలులో ఉన్నారు.
కాంగ్రెస్‌లో చేరలేదని
భూపాలపల్లి జిల్లాలో దుబ్బ శ్రీనివాస్‌ను కాంగ్రెస్‌లో చేరాలని ఒత్తిడి చేశారు. వినకపోవడంతో మంత్రి కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్సీ మురళీధర్‌రావు అనుచరుడు ఇచ్చిన తప్పుడు ఫిర్యాదు తో పోలీసులు కేసు నమోదు చేశారు.
కిడ్నాప్‌ను ప్రశ్నిస్తే..
జనగామ జిల్లా చిన్నమడూరు భూవివాదం లో దేవరుప్పులకు చెందిన యూత్ కాంగ్రెస్ నాయకుడు కిడ్నాప్‌నకు పాల్పడ్డాడు. నిరసన తెలిపిన చిన్నమడూరుకు చెందిన బీఆర్ఎస్ నాయకులు వంగ అర్జున్, గొడుగు మల్లికార్జున్‌పై కేసు నమోదు చేసి, జైలుకు పంపించారు.
గురుకులం ముందు బైఠాయిస్తే..
జనగామ జిల్లా రాజవరంలో బీఆర్ఎస్ గురుకులాల బాట సందర్భంగా కేజీబీవీకి వెళ్లా రు. లోపలికి అనుమతించనందుకు నిరసనగా గురుకులం ముందు బైఠాయించిన బీఆర్ఎస్ నాయకుడు కేశిరెడ్డి రాకేశ్‌రెడ్డి సహా 20 మం దిపై కేసు నమోదు చేశారు.
ఆరోపణలు చేస్తే..
మంచిర్యాల జిల్లా చెన్నూరు, మందమర్రి పట్టణాల్లో 10 మంది బీఆర్ఎస్ లీడర్లపై కేసులయ్యాయి. ఎమ్మెల్యే వివేక్, ఎంపీ వంశీకి వ్యతిరేకంగా మాట్లాడారని, సోషల్ మీడియాలో ప్రచారం చేశారని అభియోగాలు నమోదు చేశారు.
ఫ్లెక్సీలు చింపేస్తే..
సిద్దిపేటలో రేవంత్‌రెడ్డి, మైనంపల్లి ప్లెక్సీలు చింపివేశారనే కారణంతో పోలీసులు కేసు నమోదు చేశారు. సిద్దిపేట వన్‌టౌన్ పీఎస్‌లో బీఆర్ఎస్ నాయకులు భాస్కర్, శ్రవణ్, బెల్లంకొండ వెంకట్‌లపై కేసు పెట్టారు.
వ్యతిరేకంగా మాట్లాడితే
మంథని డివిజన్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన స్థానికులపై అట్రాసిటీ కేసు లు నమోదు చేశారు. వీరిలో ఖమ్మంపల్లి మా జీ సర్పంచ్ సముద్రాల శ్రీనివాస్, రైతు కొమురయ్య, రామగిరి మండలం రత్నాపూర్‌కు చెందిన బర్ల వెంకటయ్య ఉన్నారు.
సమావేశానికి వెళ్లారని..
ఇటీవల కొల్లాపూర్‌లో ఎమ్మెల్సీ కవిత స మావేశానికి వెళ్లారన్న కారణంతో కోడేరు మం డలం తండాకు చెందిన రాజునాయక్, రవి నాయక్‌పై నాగర్‌కర్నూల్ జిల్లా, నారియా నాయక్‌తండాకు చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు దాడిచేశారు.
ఏడాదిలో 7 కేసులు
ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బాషబోయిన వీరన్న మీద రాజకీయ కక్షతో ఏడాదిలో కాంగ్రెస్ నాయకులు మొత్తం 7 కేసులు నమోదు చేయించారు. గత డిసెంబర్ 23న ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు, ఫిబ్రవరి 24న ఎస్టీ కేసు, వినాయక నిమజ్జనం సందర్భంగా అక్రమ కేసు నమోదు చేయించారు. 2024, అక్టోబర్ 27న దొంగతనం మోపి కేసు పెట్టించారు.
గ్రామసభలో ప్రశ్నిస్తే..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం, బెండలపాడులో గ్రామసభ జరిగిం ది. ఇక్కడ ప్రభుత్వ తీరును ప్రశ్నించినందుకు బీఆర్ఎస్ జిల్లా నాయకుడు మేడా మోహన్‌రావుపై కాంగ్రెస్ నాయకులు దాడి చేసి, ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టించారు.
దూషించాడని..
కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు మైనంపల్లి హన్మంతరావును దూషించాడని బీఆర్ఎస్ మె దక్ పట్టణ కన్వీనర్, మాజీ కౌన్సిలర్ మా మిండ్ల ఆంజనేయులు ఇంటిపై కాంగ్రెస్ నేత లు దాడి చేశారు. కాంగ్రెస్ నాయకుడు జీవన్‌రావు ఫిర్యాదు మేరకు కేసు పెట్టారు.
వ్యతిరేక ప్రచారం చేశారని
మెదక్ జిల్లా హవేలి ఘనపూర్ మండలం గాజిరెడ్డిపల్లికి చెందిన సాప సాయిలు బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్‌గా పనిచేస్తున్నా రు. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేసినందుకు ఆయనపై కేసు నమో దు చేశారు. ఇంటికి మొరం కొట్టుకున్నందుకు సైతం కేసు నమోదు చేశారు.
ప్రజా వంచన దినోత్సవాలు చేశారని
ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చడం లేదంటూ బీఆర్ఎస్ మంథని నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు ప్రజా వంచన దినోత్సవాలు నిర్వహించగా మంథని, రామగిరి, కమాన్‌పూర్ పోలీస్ స్టేషన్లో మూడు కేసులు నమోదు చేశారు. పుట్ట మధుతోపాటు మరో 8మంది బీఆర్ఎస్ నా యకులపైనా కేసులు నమోదు చేశారు.
కొల్లాపూర్‌లో ఉల్టా కేసులు..
కొల్లాపూర్ నియోజకవర్గంలోని సింగోటం, సాతాపూర్, చిన్నకార్పాముల, జొన్నలబొగుడ, మొ లచింతలపల్లి, తీగలపల్లి, కోడేరులో పలువురు బీఆర్ఎస్ నాయకులపై దాడులు చేసి.. వారిపైనే ఉల్టా కేసులు బనాయించారు. జొన్నలబొగుడలో మాజీ సర్పంచ్ రవినాయక్ ఇంటిపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేసి అతడిపైనే కేసు పెట్టారు. సాతాపూర్‌లో మారెట్ కమిటీ డైరెక్టర్ పరమేశ్ ఇంటిపై దాడి చేసి, ఆయనపైనే కేసు పెట్టారు. చిన్న కార్పాములలో బీఆర్ఎస్ కార్యకర్త జగదీశ్పైనే దాడి చేయించి.. అతడిపైనే తప్పుడు కేసు బనాయించారు. మొలచింతలపల్లిలో పీఏసీఎస్ వైస్ చైర్మన్ శ్రీనివాస్‌పై దాడి చేసి అతనిపైనే కేసు పెట్టారు. చింతలపల్లిలో బీఆర్ఎస్ లీడర్ భార్య అయిన అంగన్వాడీ టీచర్‌ను డిస్మిస్ చేయించారు. కోడేరు మండలం తీగలపల్లిలో భాసర్‌రెడ్డి అనే బీఆర్ఎస్ లీడర్‌పై కేసు నమోదు చేయించారు. కో డేరుకు చెందిన బీఆర్ఎస్ లీడర్ శేఖర్ యాదవ్‌పై అక్రమ కేసు బనాయించారు.
ప్రొటోకాల్‌పై అడిగినందుకు
మంత్రి సీతక్క పర్యటనకు వచ్చినప్పుడు ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రొటోకాల్ పాటించడం లేదని, తమను పిలవడం లేదని మాట్లాడటంతో ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మిపై పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
ఫ్లెక్సీ తగలబెట్టారని
6 గ్యారెంటీలు అమలు చేయాలని రేవంత్‌రెడ్డి ఫ్లెక్సీ తగలబెట్టిన ఘటనలో ఆదిలాబాద్ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జోగురామన్నపై బేల పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
విమర్శించినందుకు
సీఎం రేవంత్‌రెడ్డి, ఎమ్మెలేలు గడ్డం వివేక్, వినోద్, ఎంపీ వంశీకృష్ణపై విమర్శలు చేశాడని మంచిర్యాల బీఆర్ఎస్ కార్యాలయ ఇన్చార్జి గోగుల రవీందర్‌రెడ్డిపై ఐదారు కేసులు నమోదు చేశారు.
దవాఖాన నుంచే జైలుకు
పాత కక్షల నేపథ్యంలో వేరే వారికి యాక్సిడెంట్ చేసినట్టు హజీపూర్ మాజీ ఎంపీపీ మందపల్లి శ్రీనివాస్‌పై కేసు నమోదు చేశారు. వాస్తవానికి అతడినే కొందరు కాంగ్రెస్ లీడర్లు కొట్టారు. చికిత్స కోసం దవాఖానకు వెళ్లిన అతడిని లాక్కెళ్లి జైలుకు పంపారు.
దాడిచేసి ఉల్టా కేసు
మంచిర్యాల పట్టణానికి చెందిన యువ నాయకుడు గడప రాకేశ్ కారుపై దుండగులు దాడిచేసి ఆయనను గాయపరిచారు. పరస్పర దాడులు అని చెప్పి ఉల్టా రాకేశ్పైనే మంచిర్యాల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు.
దిష్టిబొమ్మ దహనం చేసినందుకు
భూపాలపల్లిలో రేవంత్ దిష్టిబొమ్మను దహనం చేశారని కటకం జనార్దన్, బుర్ర రమే శ్, కొత్త హరిబాబు, మాడ హరీశ్‌రెడ్డి, సెగ్గం సిద్దు, అందె విద్యాసాగర్, పింగిలి రవీందర్‌రెడ్డి, శ్రీకాంత్ పటేల్‌పై కేసులు పెట్టారు.
అక్రమ కేసును నిరసించినందుకు
ఎమ్మెల్సీ కవితపై ఈడీ పెట్టిన అక్రమ కేసును నిరసిస్తూ భూపాలపల్లిలో ధర్నా చేసినందుకు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి సహా మరో ఏడుగురిపై కేసు పెట్టారు.
నిమ్మతోటను తగలబెట్టించి
నల్లగొండ జిల్లా కడపర్తికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు గొర్ల భిక్షంకు చెందిన 2 ఎకరాల నిమ్మతోటను ఎమ్మెల్యే వేముల వీరేశం గన్‌మన్‌తో తగలబెట్టించి, ఆ పైన భిక్షంపై కేసులు పెట్టించారు. ఇప్పటికీ భిక్షంకు చెందిన పదెకరాల భూమి పడావుగా ఉన్నది.
పరీక్షల వాయిదా కోరితే
నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలంలో పరీక్షలు వాయిదా వేయాలంటూ మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం ప్రధాన ద్వారం వద్ద నిరసన చేపట్టినందుకు విద్యార్థి నాయకుడు వాడపల్లి నవీన్‌పై కేసు నమోదు చేశారు.
దాడిని అడ్డుకున్నందుకు
సిద్దిపేటలోని ఎమ్మెల్యే హరీశ్‌రావు క్యాంప్ కార్యాలయంపైకి కాంగ్రెస్ నాయకుడు ఎర్ర మహేందర్ దాడికి రావడంతో బీఆర్ఎస్ నా యకులు అడ్డుకున్నారు. దీంతో ఎర్ర మహేందర్ ఫిర్యాదుతో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద ఆరుగురిపై ఉల్టా సిద్దిపేటలో కేసు నమోదైంది.
ఫ్లెక్సీని పినాయిల్‌తో కడిగితే..
సీఎం రేవంత్ ఫ్లెక్సీని పినాయిల్‌తో కడిగినందుకు సిద్దిపేట వన్‌టౌన్‌లో ఆరుగురు బీఆర్ఎస్, బీఆర్ఎస్వీ, బీఆర్ఎస్వై నాయకులపై కేసు నమోదు. కాంగ్రెస్ ఫ్లెక్సీని డ్యామేజ్ చేశారని నలుగురిపై కేసు పెట్టారు.
ర్యాలీ తీశారని
అనుమతి లేకుండా సిద్దిపేట పట్టణంలో ర్యాలీ నిర్వహించారని రెండు స్టేషన్లలో ఏకం గా 30 మంది బీఆర్ఎస్ నాయకులపై, కాంగ్రెస్ ఫ్లెక్సీలు చింపివేశారని నలుగురు బీ ఆర్ఎస్ నాయకులపై కేసులు పెట్టారు.
కేటీఆర్‌పై వరుస కేసులు
ప్రజల తరఫున ప్రభుత్వాన్ని నిరంతరం ప్రశ్నిస్తున్న కేటీఆర్‌పై ఫార్ములా ఈ-రేస్ విషయంలో ఏసీబీ, ఈడీ కేసులు నమోద య్యాయి. తనపై తప్పుడు ప్రచారం చేశార ని ఎమ్మెల్సీ చింతపండు నవీన్ ఫిర్యాదుతో కేటీఆర్, జగదీశ్‌రెడ్డిపై బోడుప్పల్లో కేసు పెట్టారు. అనుమతి లేకుండా ప్రచారం చే శారని కేటీఆర్‌పై మరోకేసు కూడా నమో దు చేశారు. ముఖ్యమంత్రిని ‘చీప్ మినిస్టర్’ అన్నందుకు సైఫాబాద్‌లో, తెలంగాణ చిహ్నంలో చార్మినార్, కాకతీయ కళాతోర ణం తొలగించొద్దంటూ చార్మినార్ వద్ద నిరసన తెలిపినందుకు, మేడిగడ్డ బరాజ్ వద్ద, తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నం వద్ద డ్రోన్ ఎగరేశారన్న కారణంగా కేసు పెట్టారు. హరీశ్, కేటీఆర్ డీపీలు పెట్టుకొని మంత్రి కొండా సురేఖ, ఎంపీ రఘునందన్‌రావు గురించి ఎవరో తప్పుడు ప్రచారం చేశారని కేటీఆర్, హరీశ్‌పై పోలీసులు కేసు పెట్టారు. కేటీఆర్, బాల్క సుమన్, గండ్ర వెంకట రమణారెడ్డిపై భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్‌లో కేసు నమోదుచేశారు.
మూసీ విషయంలో రేవంత్‌పై ఆరోపణలు చేసినందుకు ఉట్నూర్‌లో కేసు పెట్టారు. అమృత్ టెండర్ల వ్యవహారంలో సృజన్రెడ్డిపై చేసిన ఆరోపణలపై కేటీఆర్‌కు లీగల్ నోటీసులు పంపారు. రేవంత్‌పై విమర్శలు చేసినందుకు హనుమకొండలో జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి బంజారాహిల్స్‌కు బదలాయించారు. లగచర్ల రైతులు అధికారులపై దాడికి దిగారని, అందుకు మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి ప్రోద్బలం ఉన్నదనే అభియోగాలతో అరెస్ట్ చేశారు. వాంగ్మూలంలో కేటీఆర్ పేరు కూడా చెప్పారంటూ ఆయనను కేసులో ఇరికించే ప్రయత్నం చేశారు. ఫార్మాలా రేస్‌పై ఏసీబీ విచారణకు హాజరై కేటీఆర్ ఇంటికి వెళ్తున్న సమయంలో కార్యకర్తలు ర్యాలీ తీశారు. దీంతో బంజారాహిల్స్ పోలీసులు కేటీఆర్‌తో పాటు బీఆర్ఎస్ నేతలు గెల్లు శ్రీనివాస్‌యాదవ్, క్రిశాంక్, జైసింహ, మన్నె గోవర్ధపై కేసు పెట్టారు. సీఎం ఫొటోలు మార్ఫింగ్ చేశారనే అభియోగంపై మొయినాబాద్‌లోనూ కేటీఆర్‌పై కేసు నమోదైంది.
మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, భూ కబ్జా కేసులు నమోదు చేయించడంతో మంచిర్యాల జిల్లా నస్పూర్ మున్సిపాలిటీ, 21వ వార్డు కౌన్సిలర్ బేర సత్యనారాయణ ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
నిరసన తెలపడమే నేరమా?
‘నిరసన’.. ‘ఆందోళన’.. ‘ధర్నా’ అనే మాటలు వినపడితే చాలు.. కాంగ్రెస్ పెద్దలకు ముచ్చెమటలు పడుతున్నాయి. గురుకులాల్లో విద్యార్థులు ఫుడ్‌పాయిజన్ వల్ల చనిపోతుంటే.. పరిశీలించేందుకు గురుకులాల బాట పట్టినందుకు బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌పై ఇబ్రహీంపట్నంలో 447 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. మహబూబ్‌నగర్‌లో కార్యకర్తలకు అండగా ఉండి నిరసన తెలిపినందుకు మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సహా 18 మందిపై కేసులు బుక్ చేశారు. వరంగల్ ఎంజీఎంలో శిశువును కుక్కలు పీక్కుతిన్న ఘటనపై ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఆందోళన చేసిన వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌తోపాటు మరో 9 మందిపై కేసు నమోదు చేశారు. హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గంలోని అగ్రంపహాడ్‌లో కాంగ్రెస్ నేతల ఫిర్యాదుతో 12 మంది బీఆర్ఎస్ నాయకులను అకారణంగా పోలీసులు స్టేషన్‌కు పిలిపించి ఇష్టం వచ్చినట్టు కొట్టారు. కరీంనగర్ సీపీ కార్యాలయ పరిధిలో బీఆర్ఎస్ నాయకులే లక్ష్యంగా ముగ్గురు మహిళా కార్పొరేటర్ల భర్తలను అరెస్టు చేశారు. అచ్చంపేట భ్రమరాంబ ఆలయ ఉత్సవాల్లో భాగంగా ఊరేగింపుగా వెళ్లిన మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, ఆయన అనుచరులపై, జగిత్యాల జిల్లా మెట్పల్లిలో కాంగ్రెస్ నేతల సూచనతో పలువురు బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమంగా కేసులు పెట్టారు.
బాధిత కుటుంబానికి న్యాయం కోరితే..
ఖమ్మం జిల్లా చింతకాని మండలం లచ్చగూడెంలో నిరుడు అక్టోబర్ 5న గూని ప్రసాద్ అనే రైతు విద్యుత్తు షాక్‌తో పొలంలో చనిపోయాడు. ఆ రైతు కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ రైతులు ప్రసాద్ మృతదేహాన్ని కొదుమూరు విద్యుత్తు సబ్‌స్టేషన్ ఎదుట ఉంచి ధర్నా చేసేందుకు బయలుదేరారు. దీంతో పోలీసులు బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పెంట్యాల పుల్లయ్యను అరెస్టు చేశారు. పుల్లయ్య ఖమ్మం సబ్ జైలులో 16 రోజులు ఉండి, బెయిలుపై విడుదలయ్యారు.కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసినందుకుపెద్దపల్లి జిల్లా రామగుండంలో మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో మాజీ సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. సీఎం రేవంత్ దిష్టిబొమ్మను దహనం చేశారు. దీంతో పోలీసులు కోరుకంటి చందర్‌తోపాటు బీఆర్ఎస్ నేతలు మెతుకు దేవరాజ్, నూతి తిరుపతి, బొడ్డుపల్లి శ్రీనివాస్, ఎన్ మారుతి, రకం వేణు, గాదం విజయ, కృష్ణవేణి, బొబ్బిలి సతీశ్, కిరణ్, కోడి రామకృష్ణ, సత్తా శ్రీనివాస్, ఆవునూరి వెంకటేశ్‌తోపాటు మరికొందరు కార్యకర్తలపై పోలీసులు కేసు పెట్టారు.
దివ్యాంగుడి ఇల్లు కూల్చడంపై నిరసన తెలిపితే..
మహబూబ్‌నగర్ పట్టణంలో దివ్యాంగుల ఇండ్లను అధికార యంత్రాంగం అక్రమంగా కూల్చివేసింది. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ వైఖరిపై మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తమ్ముడు శ్రీకాంత్‌గౌడ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు నిరసన తెలిపారు. ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి ప్రోద్బలంతో కాంగ్రెస్ కార్యకర్తల ఫిర్యాదుతో శ్రీకాంత్‌గౌడ్‌తోపాటు, మాజీ కౌన్సిలర్ రాజుపై పోలీసులు కేసులు పెట్టారు.
క్రిశాంక్‌పై 11 కేసులు
ప్రజాసమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్న బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్చార్జి మన్నె క్రిశాంక్పైనా కాంగ్రెస్ సర్కారు వేధింపులకు పాల్పడుతున్నది. క్రిశాంక్‌పై పోలీసులు ఇప్పటివరకు 11 కేసులు నమోదు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఆయన సోదరులు అవినీతికి పాల్పడుతున్నారని ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసినందుకు క్రిశాంక్‌పై మాదాపూర్ పీఎస్‌లో కేసు నమోదైంది. సోం డిస్టిలరీ కంపెనీపై ఆరోపణలు చేసినందుకు భూపాలపల్లి కోర్టుకు రావాలని క్రిశాంక్‌కు నోటీసులిచ్చారు.
కౌశిక్‌రెడ్డిపై కక్ష
కరీంనగర్ జడ్పీ సమావేశంలో ప్లకార్డులతో నిరసన తెలిపినందుకు ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై హుజూరాబాద్ పోలీసులు కేసు పెట్టారు. తన ఫోన్‌ను ట్యాప్ చేస్తున్నారని సీఎంపై, పోలీసులపై ఫిర్యాదు ఇవ్వడానికి బంజారాహిల్స్ పీఎస్‌కు వెళ్లిన కౌశిక్‌తో పాటు 20 మంది కార్యకర్తలపైనా పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐపై దురుసుగా ప్రవర్తించి, బెదిరింపులకు పాల్పడ్డాడంటూ పేర్కొన్నారు. విధులకు ఆటంకం కలిగించారని గచ్చిబౌలి పీఎస్‌లో కౌశిక్‌పై కేసు నమోదు చేశారు. పోలీసు వ్యవస్థను కించపరిచేలా మాట్లాడారంటూ కరీంనగర్ వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇలా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కౌశిక్‌రెడ్డిపై 28 కేసులు నమోదు చేసింది.
హరీశ్‌రావుపై కేసుల పరంపర
కాంగ్రెస్ ప్రభుత్వం అరాచకాలను ప్రశ్నిస్తున్నందుకు మాజీ మంత్రి హరీశ్‌రావుపై రేవంత్ సర్కారు వేధింపులకు పాల్పడుతున్నది. 2024 ఆగస్టులో యాదగిరిగుట్టలో కేసు నమోదు చేశారు. అక్టోబర్‌లో సైబర్‌క్రైమ్ పీఎస్‌లో కేసు నమోదు చేసి, కరీంనగర్‌కు బదిలీ చేశారు. 2024 నవంబర్‌లో కరీంనగర్లో పోలీసులు కేసు నమోదు చేశారు. 2024 డిసెంబర్లో పంజాగుట్టలో ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదు చేయగా, హైకోర్టు ఇటీవల కేసును కొట్టివేసింది. 2025 ఫిబ్రవరిలో బాచుపల్లిలో కేసు నమోదు చేశారు. పాడి కౌశిక్‌రెడ్డి అరెస్ట్ అక్రమమని నిలదీస్తూ కౌశిక్‌రెడ్డి ఇంటికి వెళ్లిన హరీశ్‌రావుతో పాటు కార్యకర్తలపైనా పోలీసులు కేసు నమోదు చేసి, అరెస్ట్ చేశారు.
తెలంగాణలో ప్రజాపాలన పేరిట కాంగ్రెస్ ప్రజాకంటక పాలన సాగిస్తున్నదని సబ్బండ వర్గాలు మండిపడుతున్నాయి. ‘ప్రశ్నిస్తే కేసులు.. నిలదీస్తే అరెస్టులు’ అన్నట్టుగా సర్కారు వ్యవహారం ఉన్నదని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి. రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ అమలవుతున్నదని కొన్నిరోజులుగా జరుగుతున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.
అలవిగాని హామీలిచ్చి, అమలుపై చేతులెత్తేసిన కాంగ్రెస్‌ను ఇదేమిటని ప్రశ్నించినా.. క్షేత్రస్థాయిలో ప్రజల స్పందనలను వెలుగులోకి తెచ్చినా అక్రమ కేసులు, నిర్బంధాలు, వేధింపులు, కక్షసాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. ప్రజాపాలనలో ప్రశ్నించే గొంతులను సర్కారు నొక్కేస్తున్నదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
(తోటపల్లి రవికుమార్)