ములుగు, సెప్టెంబర్ 27 (నమస్తేతెలంగాణ)/తాడ్వాయి/వరంగల్: రిజర్వు ఫారెస్టులో పోడు చేస్తున్నారనే సమాచారం మేరకు అక్కడికి వెళ్లి జేసీబీని స్వాధీనం చేసుకున్న అటవీ అధికారులపై కొందరు దాడికి తెగబడ్డారు. ములుగు జిల్లా తాడ్వాయి రేంజ్ పరిధిలోని దామరవాయి గ్రామ శివారులో పోడు చేస్తున్నారనే సమాచారం మేరకు ఎఫ్ఎస్వో వినోద్‌కుమార్, ఎఫ్‌బీవోలు శరత్చంద్ర, సుమన్, బేస్ క్యాపు సిబ్బంది ఎట్టి శ్రీను, జీపు డ్రైవర్ రాజేందర్ గురువారం రాత్రి పెట్రోలింగ్‌కు వెళ్లారు. తాడ్వాయి వైపు వస్తున్న జేసీబీని ఆపి ఎక్కడికి వెళ్లి వస్తున్నారంటూ ప్రశ్నించారు. పోడు చేసి వస్తున్నారని గుర్తించి జేసీబీని స్వా ధీనం చేసుకొని రేంజ్ కార్యాలయానికి తరలించేందుకు యత్నించారు. ఆగ్రహించిన జేసీ బీ యజమాని గంట సూరజ్‌రెడ్డి, ఆపరేటర్ నీరటి శ్రీకాంత్, గంట శశిధర్, పాండవుల సాయికుమార్, మ్యాదరి చంటి కలిసి దాడి చేయడంతో ఎఫ్ఎస్వో వినోద్‌కుమార్, ఎఫ్‌బీలు శరత్చంద్ర, సుమన్ తల, చేతులకు తీ వ్రగాయాలయ్యాయి. వారిని వరంగల్‌లోని ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించి చికిత్స అందిస్తున్నారు. దాడికి పాల్పడిన సూరజ్‌రెడ్డి, శశిధర్, చింటు, సాయి, శ్రీకాంత్‌ను శుక్రవారం కాటాపూర్ క్రాస్ రోడ్డు వద్ద అరెస్టు చేసినట్టు ఎస్పీ శబరీష్ తెలిపారు. కాగా రెవెన్యూ భూ మిలో పైప్‌లైన్ కందకాలు తీసేందుకు వెళ్లి రాత్రి 11 గంటలకు తిరిగి వస్తుండగా అటవీ అధికారులు బూతులు తిడుతూ తన తమ్ము డు శశిధర్‌పై బండరాయితో తలపై కొట్టడంతో రక్తస్రావమైందని, దీంతో తాము దాడి చేశామని సూరజ్‌రెడ్డి తెలిపారు. అధికారులపై దా డిని మంత్రులు సురేఖ, సీతక్క, కలెక్టర్ టీఎస్ దివాకర, ఆదివాసీ సంఘాల నాయకులు ఖండించారు. శుక్రవారం మంత్రి సురేఖ దవాఖానకు వెళ్లి వారిని పరామర్శించారు.