సుల్తాన్‌బజార్, జనవరి 7 : ధర్నా పేరుతో నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై మంగళవారం కాంగ్రెస్ శ్రేణుల దాడి హేయమైన చర్య అని ఆ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తమ సహనాన్ని పరీక్షించవద్దని, దాడిచేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డీజీపీకి సూచించారు.
రాష్ట్రంలో రక్షణ కొరవడిందని, లా అండ్ ఆర్డర్ ఎక్కడుందని? మీ పార్టీ కార్యకర్తలకు ఇతర పార్టీల కార్యాలయాలపై దాడి చేయాలని నేర్పిస్తున్నారా? అని సీఎం రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు. అదే దాడి మేము చేస్తే కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని తగులబెడ్తామని హెచ్చరించారు. నిరసన తెలిపేందుకు ఓ పద్ధతి ఉంటుందని తెలిపారు. గూండాయిజం చేసేవారికి గూండాయిజంతోనే సమాధానం చెప్పాల్సి వస్తుందని హెచ్చరించారు. దాడులపై సీఎం రేవంత్‌రెడ్డి తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.