హైదరాబాద్, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ): ప్లేట్‌మీల్స్ తినాలంటే రూ.80.. ఫుల్‌మీల్స్ అయితే రూ.100 ఖర్చు అవుతుంది. అలాంటిది.. గర్భిణులు, బాలింతలు తినే భోజనానికి రాష్ట్ర ప్రభుత్వం పెడుతున్న ఖర్చు ఎంతో తెలుసా.. రూ.27.59 మాత్రమే. అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణులు, చిన్నారులకు అన్ని రకాల పోషకాలతో భోజనం పెడుతున్నామని చెప్పుకుంటున్న ప్రభుత్వం.. ఇంత తక్కువ ఖర్చుతో ఏ స్థాయి పోషకాల పుడ్డు పెడుతున్నదో అర్థం అవుతున్నది. చాలీచాలని ఆహార పదార్థాలు, అరకొరగా చెల్లించే కూరగాయల బిల్లులతో అంగన్‌వాడీకేంద్రాలను ఎలా నడిపించాలో తెలియక అక్కడి టీచర్లు లబోదిబోమంటున్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల లెక్కల ప్రకారం గర్భిణులు, బాలింతలకు 1192.38 క్యాలరీలు, 37.04 గ్రాముల ప్రోటీన్లు, 578.56 మిల్లీగ్రాముల క్యాల్షియం అందించాలి. ఈ పోషకాలు ఉండే భోజనం అందించాలంటే రూ.27.59 ఏం సరిపోతాయి? అని అంగన్వాడీ టీచర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బియ్యం, పప్పులు, నూనె వంటి వస్తువులను నేరుగా అంగన్వాడీలకు సరఫరా చేస్తున్న ప్రభుత్వం.. వంట ఖర్చులు/కూరగాయల కోసం డబ్బు చెల్లిస్తున్నది.
అయితే కూరగాయల కోసం ఒక్కొక్కరికి రూ.1.50 మాత్రమే ఇస్తున్నది. చిన్నారులకు ఇందులో సగం.. అంటే రూ.0.75 చెల్లిస్తున్నది. ఒక అంగన్వాడీ కేం ద్రంలో 10 మంది బాలింతలు ఉంటే వారికి రూ.15 చెల్లిస్తున్నది. చిన్నారులు 10 మంది ఉంటే వారికి రూ.7.50 మాత్రమే. అంటే 20 మందికి 22.50 తోనే కూరగాయల భోజనం పెట్టాలన్న మాట. 3-6 ఏండ్ల చిన్నారులకు 11.50, 7 నెలల నుంచి 3 ఏండ్లలోపు చిన్నారులకు రూ.9.68 చొప్పున వంట ఖర్చుల కోసం చెల్లిస్తున్న డబ్బులూ సరిపోవటం లేదన్నది టీచర్ల వాదన. 8 ఏండ్ల కిం దట నిర్ణయించిన ధరలనే ఇప్పటికీ అమలు చేస్తున్నారు.
రాష్ట్రంలోని పాఠశాల విద్యాశాఖ పరిధిలో మధ్యాహ్న భోజన పథకంలో విద్యార్థులను మూడు క్యాటగిరీలుగా విభజించారు. మార్కెట్ లెక్కల ప్రకారం వంట ఖర్చులు (కూరగాయల కోసం) చెల్లిస్తున్నారు. వంటఖర్చులకు 1-5 స్కూల్ విద్యార్థులకు రూ.5.40, 6-8 తరగతుల వారికి రూ.8.17, 9-10 తరగతుల వారికి రూ.8.67 చొప్పున చెల్లిస్తున్నారు. అలాంటప్పుడు అంగన్వాడీ కేంద్రాలకు రూ.1.50 మాత్రమే ఎందుకు చెల్లిస్తున్నారోనని అంగన్వాడీ టీచర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.