నమస్తే తెలంగాణ న్యూస్ నెట్వర్క్, మే 18: బీఆర్ఎస్ పార్టీని మరోసారి దీవించాలని ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రజలను కోరారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలతో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిచిందని వారు పేర్కొన్నారు. బీఆర్ఎస్ మరోసారి అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్ సాధించేలా పార్టీ కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. గురువారం పలు జిల్లాల్లో బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనాలు ఉత్సాహభరిత వాతావరణంలో జరిగాయి. కార్యకర్తలు తమ కుటుంబ సభ్యులతో హాజరయ్యారు. తమ సమస్యలను ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలకు విన్నవించుకున్నారు. ప్రజాప్రతినిధులు, నేతలు కార్యకర్తలతో కలిసి భోజనాలు చేశారు. ఆద్యంతం సమ్మేళనాలు సందడిగా జరిగాయి.