కరీంనగర్ కలెక్టరేట్, ఏప్రిల్ 4: కరీంనగర్ నగరపాలక సంస్థలో విలీనమైన పలు శివారు గ్రామాల్లోని ఉపాధి కూలీలకు (NREGA Workers) రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఆత్మీయ భరోసా అంతేనా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆయా గ్రామాల్లో రెండు నెలల క్రితమే ఉపాధి పనులు నిలిపేయగా, తమను ఆత్మీయ భరోసా పథకం ద్వారానైనా ఆదుకునేనా? లేక చేతులెత్తేసేనా అనే ఆందోళన కూలీలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఐదు నెలల క్రితం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరుతో భూమి లేని వ్యవసాయ కూలీలకు ఏటా రూ.12వేలు ఇచ్చేందుకు సర్వే నిర్వహించించి. భూమి లేని ఉపాధి కూలీలను అర్హులుగా గుర్తించి ప్రకటించింది.
ప్రభుత్వం నిర్వహించిన సర్వేలో జిల్లావ్యాప్తంగా16,565 మంది భూమిలేని ఉపాధి కూలీలు ఉన్నట్లు తేల్చగా, వెళ్లిన గ్రామాల్లో 8 వేలకు పైగా ఉన్నట్లు గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు ప్రకటించారు. అప్పటికి నగరంలో ఆ గ్రామాలు విలీనం కాకపోవటంతో సంబంధిత అధికారులు అర్హులైన వారి పేర్లతో కూడిన జాబితా ప్రభుత్వానికి పంపారు. అయితే, మండలానికి ఒక గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసి ఆ గ్రామాల్లో మాత్రమే యంత్రాంగం పంపిణీ చేసింది. కొద్ది నెలల అనంతరం కరీంనగర్ రూరల్ పరిధిలోని బొమ్మకల్, గోపాల్పూర్, దుర్షేడ్ గ్రామాలతో పాటు కొత్తపల్లి మండలంలోని మల్కాపూర్ చింతకుంట గ్రామాలను నోటిఫై చేస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది. ఇప్పటివరకు ఉపాధి కూలీలకు పైలెట్ గ్రామాలు మినహా మిగతా చోట్ల ఎక్కడ కూడా ఆత్మీయ భరోసా విడుదల చేయలేదు. నగరపాలక సంస్థతో పాటు జిల్లాలోని ఇతర మున్సిపాలిటీల్లో విలీనమైన గ్రామాల్లో ఉపాధి హామీ పనులు ఫిబ్రవరి నెల నుంచి నిలిపివేశారు. అయితే ఆత్మీయ భరోసాపై మాత్రం ప్రకటన చేయలేదు. దీంతో, కేంద్ర నిబంధనలు కఠినంగా అమలు చేసినా, కనీసం రాష్ట్ర ప్రభుత్వం రూ.12వేల ఆర్థిక సాయంపై భరోసా కల్పించి, నిరుపేద కూలీల పట్ల ఆత్మీయతను చాటుకోవాలని కోరుతున్నారు.
ప్రభుత్వం మాత్రం వీలైంతమేరకు ఆత్మీయ భరోసా లబ్ధిదారులను వీలైనంతమేకు తగ్గించాలని ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో, విలీన గ్రామాల్లో ఉపాధి పనులు కొనసాగించాలంటూ అధికార, ప్రతిపక్ష ప్రజాప్రతినిధులు కూడా వినతులు సమర్పిస్తున్నా ఆచరణలో అమలుకావడం లేదు. ఈ పరిస్థితుల్లో తమకు ఆశాభంగం మిగిల్చేనా? ఆశ నెరవేర్చేనా? అని విలీన కూలీలు ఉద్వేగాన్ని వ్యక్తం చేస్తున్నారు.