హైదరాబాద్, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం(ఎంజీఎన్ఆర్ఈజీఎస్) లక్ష్యం నీరుగారుతున్నది. చెమటోడ్చి పనిచేసిన కూలీలకు సకాలంలో కూలి ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారు. ప్రభుత్వ బాధ్యతారాహిత్యంతో లక్షలాది మందికి మూడు నెలలుగా కూలి డబ్బులు నిలిచిపోయాయి. రెకాడితేగానీ డొకాడని నిరుపేదలు, చెమట చిందించి చేసిన పనికి పైసా రాకపోవడంతో అల్లాడిపోతున్నారు. మూడు నెలలుగా కూలి డబ్బులు అందక, ఈ కేవైసీ కొర్రీలతో కూలీలు పనులకు వెళ్లడమే మానేస్తున్న దుస్థితి దాపురించింది. రూ.300 కోట్లు రావాల్సి ఉండగా, కేవలం రూ.57 కోట్లతో సర్దుకోమంటారా? అని కూలీలు మండిపడుతున్నారు. ఉపాధి పనులు చేయించే ఫీల్డ్ అసిస్టెంట్లకూ మూడు నెలలుగా వేతనాలు అందడం లేదు. చట్టం ప్రకారం 15 రోజుల్లోగా కూలి డబ్బులు జమవ్వకపోతే రోజువారీగా లెకేసి పరిహారాన్ని అందించాలి. కానీ, కేంద్ర ప్రభుత్వం మాత్రం బ్యాంక్ అకౌంట్లు, ఆధార్ లింక్ అంశాలను అడ్డుపెట్టుకొని పథకం ఉద్దేశాన్ని నీరుగారుస్తున్నది.
రాష్ట్రంలో 52.21 లక్షల జాబ్‌కార్డులు ఉండగా, మొత్తం 1.07 కోట్ల మంది కూలీలు ఉన్నారు. వీరిలో యాక్టివ్‌గా పనిచేసే కూలీలు 49.64 లక్షల మంది. వీరికి కనీసం వంద రోజులకు తగ్గకుండా ఉపాధి కల్పించాల్సి ఉన్నది. ఇందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం జాతీయ మొబైల్ పర్యవేక్షణ విధానం(ఎస్ఎంఎంఎస్) ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకి తెచ్చింది. ఈ యాప్‌లో కూలీల ముఖ ఆధారిత హాజరు తీసుకున్నాకే పని కల్పించాల్సి ఉంటుంది. ఫీల్డ్ అసిస్టెంట్లు, మేట్లు యాప్‌లో కూలీల ఫొటో తీసినప్పుడు కూలీలు కనురెప్పలు మూసి తెరువాలి. ఇలా ఐదారుసార్లు చేయాలి. ఇలా ఒక్కొక్కరి ఫొటో తీసి యాప్‌లో అప్లోడ్ చేయాలి. ఉదయం 8 గంటలకు ఒకసారి ఫొటో దిగితే, మళ్లీ మధ్యాహ్నం 12 గంటలకు (కనీసం 4గంటలు గ్యాప్) ఫొటో తీయడానికి ఆస్కారం ఉంటుంది. ఒక గ్రామంలో వంద మంది కూలీలు 4-5 ప్రాంతాల్లో పని చేస్తున్నారనుకుంటే అన్ని ప్రాంతాలకు వెళ్లి ఫీల్డ్ అసిస్టెంట్ రెండుసార్లు అథెంటికేషన్ ఫొటో తీయాల్సిందే. లేకపోతే పనిచేసినా డబ్బులు జమకావు. ఈ ఫొటో క్యాప్చర్ ప్రక్రియను యాప్ సరిగ్గా గుర్తించకపోవడం, టెక్నికల్ సమస్యలు, సిగ్నల్స్ అందకపోవడంతో చాలామంది కూలీలు పనులకు దూరమవుతున్నారు. 2023 జనవరి 1 నుంచి కేంద్ర ప్రభుత్వం ఆధార్‌ను తప్పనిసరి చేసింది. కానీ, ప్రజలకు అవగాహన కల్పించటంలో విఫలమైంది. జాబ్‌కార్డుకు, ఆధార్, బ్యాంక్ అకౌంట్‌ను అనుసంధానించటం, పేర్లు, పుట్టిన తేదీల్లోని వివరాలు సరిపోలకపోవడం వల్ల రాష్ట్రంలో సుమారు 5 లక్షల మంది ఆధార్ పేమెంట్ సిస్టమ్‌లో తమ పేర్లు నమోదు చేసుకోలేకపోయారు. దీంతో వీరంతా ఉపాధి పనులకు దూరమయ్యారు. అంతేకాకుండా 700 మంది ఫీల్డ్ అసిస్టెంట్లకూ 3 నెలలుగా వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
యూపీఏ ప్రభుత్వం పనిని హకుగా కల్పిస్తే, ఎన్డీఏ సర్కార్ మాత్రం పని దినాలపై నియంత్రణ విధించింది. కొత్త నిబంధనల మేరకు రాష్ట్రాలు ఏడాదికి 60 రోజులను గుర్తించి పంట కాలంలో పనులు చేపట్టకుండా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. గతంలో కేంద్రం 90 శాతం, రాష్ట్ర ప్రభుత్వాలు 10 శాతం నిధులు భరించాల్సి ఉండగా, దానికి కేంద్రం 60, రాష్ర్టాలు 40 శాతం భరించేలా మార్పులు తెచ్చారు. అయినా, కేంద్రం నుంచి రాష్ట్రానికి దాదాపు రూ.307 కోట్ల నిధులు అందాల్సి ఉన్నది. ఇప్పటివరకు కేవలం రూ.57 కోట్లు మాత్రమే విడుదలయ్యాయి. ప్రతి నెలా రూ.100 కోట్ల చొప్పున మూడు నెలలకు రూ.300 కోట్లు పెండింగ్ ఉన్నాయి. కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై రాష్ట్రం ఒత్తిడి తీసుకురాకపోవడంతో ఈ పరిస్థితి దాపురించిందని ఉపాధి కూలీలు విమర్శిస్తున్నారు.
జాబ్‌కార్డులు: 52.21 లక్షలు
మొత్తం కూలీలు :1.07 కోట్లు
యాక్టివ్ కూలీలు: 49.64 లక్షలు
హైదరాబాద్, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిరోజూ 8 లక్షల మంది కూలీలకు ఉపాధి పని కల్పించడమే లక్ష్యంగా యంత్రాంగం పనిచేయాలని పీఆర్ఆర్డీ కమిషనర్ దివ్యాదేవరాజన్ ఆదేశించారు. పనుల పురోగతిపై ప్రతిరోజూ సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తానని పేర్కొన్నారు. నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు తీసుకుంటూనే.. కష్టపడి పనిచేసే క్షేత్రస్థాయి సిబ్బందికి ప్రోత్సాహకాలు అందిస్తామని తెలిపారు. గురువారం ఆమె తన కార్యాలయం నుంచి డీఆర్డీవోలు, ఎంపీడీవోలు, ఏపీవోలతో వీడియో కాన్ఫ రెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కంప్యూటర్ల ద్వారానే వీసీలో లాగిన్ అవ్వాలని, మొబైల్ ఫోన్ల ద్వారా వీసీకి హాజరయ్యేందుకు అనుమతి లేదని స్పష్టంచేశారు. కూలీల సంఖ్య తగ్గడానికి గల కారణాలను విశ్లేషిస్తూ, లక్ష్యాన్ని చేరుకోవడంలో విఫలమైతే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.