వనపర్తి/ఖానాపురం, జూలై 12: సీఎం కేసీఆర్ సాహసోపేత నిర్ణయంతో దేశంలోనే రికార్డు స్థాయిలో ఏక కాలంలో 1.50 లక్షల మందికి పోడు పట్టాలు పంపిణీ చేశామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. బుధవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జెడ్పీ చైర్మన్ లోకనాథ్‌రెడ్డి, కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్‌తో కలిసి మంత్రి గిరిజనులకు పోడు పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు పోడు భూముల పట్టాల పంపిణీకి శ్రీకారం చుట్టామని తెలిపారు. ఎక్కడైనా సర్వే చేయకపోవడం, సరైన పత్రాలు చూపించడంలో జాప్యం జరిగి పట్టాలు అందని వారికి.. అర్హత ఉంటే మరోమారు సర్వే చేయించి పోడు పట్టాలు అందేలా చర్యలు తీసుకుంటామని మంత్రి చెప్పారు. పోడు పట్టా లబ్ధిదారులు ఎకరాకు 15 మొక్కలు పెంచాలని సూచించారు. వరంగల్ జిల్లా ఖానాపురం మండలంలోని బండమీది మామిడితండా, మనుబోతులగడ్డ, నాజీతండా, వేపచెట్టుతండా, బద్రుతండా, ధర్మరావుపేటల్లో 913 మంది రైతులకు 1,788 ఎకరాలకు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి పోడు హక్కుపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నర్సంపేట నియోజకవర్గంలో రైతులకు పోడు పట్టాలు అందించడమే కాకుండా పెట్టుబడిసాయం కింద రైతుబంధు, రైతుబీమాను వర్తింపజేసిన మహానుభావుడు సీఎం కేసీఆర్ అన్నారు.
సిలిండర్ రేట్లపై మోదీని అడగాలి
‘సిలిండర్ రేట్లు పెంచుతున్నారు సారూ.. ఎట్లాగైనా తగ్గించండి’ అని గిరిజన మహిళ ధర్మాని మంత్రి నిరంజన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లింది. దానికి మంత్రి స్పందిస్తూ.. ‘సిలిండర్ రేట్ల గురించి పైన ఉన్న గడ్డపాయనను(మోదీ)ని అడగాలి. ఆయన ఇష్టం వచ్చినట్టు పెంచుకుంటూ పోతున్నారు. దాని పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నది. గ్రామాలు, తండాల్లో పశువుల పెంపకాన్ని పెంచాలి. దాని నుంచి సేంద్రియ గ్యాస్‌ను ఉత్పత్తి చేయాలి. వనపర్తి నియోజకవర్గంలో ఈ విధానం అమలయ్యేలా ప్రణాళికలను తయారు చేస్తున్నాం’ అని వివరించారు.