హైదరాబాద్: అసెంబ్లీ ప్రత్యేక సమావేశం (Assembly Special Session) ప్రారంభం కాగానే వాయిదా పడింది. మంత్రిమండలి సమావేశం కొనసాగుతుండటంతో సభను వాయిదా వేయాలని మంత్రి శ్రీధర్‌బాబు స్పీకర్‌ను కోరారు. మినిట్స్ తయారీకి సమయం పడుతుందని వెల్లడించారు. దీంతో స్పీకర్ ప్రసాద్ కుమార్.. సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. అయితే ప్రత్యేక సమావేశం అని చెప్పి ప్రభుత్వం సన్నద్ధం కాకపోవడంపై విపక్షాలు మండిపడుతున్నాయి. ప్రారంభంకాగనే సభను వాయిదా వేడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కులగణన నివేదిక, స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపు, ఎస్సీ వర్గీకరణ నివేదికలపై చర్చించేందుకు సోమవారం ఉందయం 11 గంటలకు అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమైంది. అయితే ఉదయం 10 గంటలకు సమావేశమైన మంత్రిమండలి వీటిపై చర్చించి ఆమోదించాల్సి ఉన్నది. ఆ సమావేశం ఇంకా ముగియకపోవడంతో సభను స్పీకర్ వాయిదా వేశారు. కాగా, ఆయా అంశాలపై అసెంబ్లీలో చర్చించి, బీసీ రిజర్వేషన్లను పెంచాలని తీర్మానం చేసి కేంద్రానికి పంపనున్నారు. ఎస్సీ వర్గీకరణకు ఎదురయ్యే ఆటంకాలు, వాటిని అధిగమించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు.