చెరో 8 సీట్లు గెలిచి 8 పైసలు తీసుకురాలే :ఎమ్మెల్యే కేవీ
హైదరాబాద్, జూలై 24 (నమస్తే తెలంగాణ): రాష్ట్రం నుంచి చెరో 8 స్థానాల్లో గెలిచిన బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు 8 పైసలు తీసుకురాలేదని కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద విమర్శించారు. బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేంద్రం నిధులు ఇవ్వకున్నా స్వశక్తితో తెలంగాణను కేసీఆర్ అభివృద్ధి చేశారని గుర్తుచేశారు.
తెలంగాణకు తీవ్ర అన్యాయం: ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి
కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కి రూ.15 వేల కోట్ల ఇచ్చి తెలంగాణకు రూపాయ ఇవ్వకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. కేసీఆర్ తెలంగాణకు శ్రీరామరక్ష అని మరోసారి రుజువైందని చెప్పారు.
రైతుభరోసా ఇస్తారా? లేదా ?: ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి
హైదరాబాద్, జూలై 24 (నమస్తే తెలంగాణ) : గత బీఆర్ఎస్ ప్రభుత్వం సీజన్ ప్రారంభంలోనే రైతుల ఖాతాల్లో రైతుబంధు జమచేసేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి గుర్తుచేశారు. కలుపు తీయడానికి వచ్చినా రైతుభరోసా ఇవ్వలేదని మండిపడ్డారు.
కేంద్రంపై కక్ష బహిర్గతం: ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి
కేంద్ర ప్రభుత్వంపై ప్రధాన ప్రతిపక్షం, పాలకపక్షం కక్ష సభలో బయటపడ్డదని ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి తెలిపారు. ఇది వికసిత భారత్ బడ్జెట్ అని పేర్కొన్నారు. అన్ని అంశాలు ప్రధాని మోదీ దృష్టిలో ఉన్నాయని తెలిపారు.
అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికే: ఎమ్మెల్యే హరీశ్‌బాబు
కాంగ్రెస్ అసమర్ధతను కప్పిపుచ్చుకోవడానికి కేంద్ర బడ్జెట్‌పై చర్చ పెట్టిందని సిర్పూర్ బీజేపీ ఎమ్మెల్యే హరీశ్‌బాబు ఆరోపించారు. పదేండ్ల క్రితం అదిలాబాద్ జిల్లాలో ఒకే కేంద్రీయ విద్యాలయముంటే, కేంద్ర ప్రభుత్వం 4 మంజూరు చేసిందని చెప్పారు.
ఎదుగుదల ఓర్వలేక నిందలు: ఎమ్మెల్యే సూర్యనారాయణ
రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదలనుచూసి ఓర్వలేక కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు నిందలు వేస్తున్నారని నిజామాబాద్ అర్బన్ బీజేపీ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఆరోపించారు. దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు కేంద్రం నిధులు ఇస్తుందని, ఒక రాష్ట్రానికి మాత్రమే నిధులు ఇవ్వదని పేర్కొన్నారు.
హామీల అమలు కనబడటం లేదు: పాయల్ శంకర్
కాంగ్రెస్ సర్కారు తీరు చూస్తుంటే ఆరు గ్యారెంటీలు అమలుచేసేవిధంగా కనబడటం లేదని ఆదిలాబాద్ బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ విమర్శించారు. ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతతో కేంద్రంపై నిందవేయడానికి శాసనసభలో తీర్మానం చేశారని పేర్కొన్నారు.