హైదరాబాద్, మార్చి 17 (నమస్తే తెలంగాణ ) : విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించే బిల్లుకు బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. బీఆర్ఎస్ను ‘బడుగుల రాష్ట్ర సమితి’గా ఆరాధిస్తున్న బీసీలకు అండగా ఉంటానని అసెంబ్లీ సాక్షిగా మరోసారి నిరూపించింది. కాంగ్రెస్ కామారెడ్డి డిక్లరేషన్‌ను అమలు చేయాల్సిందేనని, బీసీ రిజర్వేషన్లపై అసెంబ్లీలో బిల్లు పెడితే సంపూర్ణ మద్దతు ప్రకటిస్తామని మొదటినుంచీ చెప్తున్న మాటను నిలబెట్టుకున్నది. బీసీ రిజర్వేషన్ బిల్లు పెడితే కాంగ్రెస్‌కు మైలేజ్ వస్తుందనే కుత్సిత బుద్ధిని ప్రదర్శించకుండా ప్రభుత్వం తెచ్చిన బిల్లుకు అండగా నిలిచింది. రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన బిల్లులో సవరణలు ప్రతిపాదించింది. కాంగ్రెస్ ప్రభుత్వం తొలివిడతలో చేపట్టిన కులగణన తీరుపై బీసీ మేధావులు, అధ్యయనశీలురు, బీసీ వర్గాల కోసం పనిచేస్తున్న విషయ నిపుణులతో సమాలోచనలు చేసింది. క్షేత్రస్థాయిలో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు అనుసరించాల్సిన అన్ని మార్గాలను పాటించింది.
పార్టీ వేదికగా సమావేశాలు నిర్వహించటంతోపాటు తెలంగాణ జాగృతి సైతం రౌండ్‌టేబుల్ కాన్ఫరెన్స్‌లు నిర్వహించి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచింది. అసెంబ్లీలోనూ తన బలమైన బీసీ గొంతును వినిపించింది. రాజకీయాలకు అతీతంగా బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన బిల్లుకు సంపూర్ణ మద్దతు తెలిపింది. మాజీ మంత్రులు గంగుల కమలాకర్, తన్నీరు హరీశ్‌రావు, ఎమ్మెల్యే కేపీ వివేకానంద బీసీల పక్షాన బలమైన గొంతుక వినిపించారు. పంచాయతీ నుంచి పార్లమెంట్ ఎన్నికల దాకా బీసీలకు కేసీఆర్ అండగా నిలిచిన విధానం, జనరల్ స్థానాల్లోనూ బీసీలకు అవకాశం కల్పించి చట్టసభలకు పంపిన సందర్భాలను వివరించారు. గొర్రెల పంపిణీ, ఉచిత చేప పిల్లల పంపిణీ, నాయీ బ్రాహ్మణులు, రజకుల లాండ్రీ షాపులకు 250 యూనిట్ల ఉచిత విద్యుత్తు ఇవ్వడమే కాకుండా మార్కెట్, ఎండోమెంట్ కమిటీల్లో 50% బీసీలకు రిజర్వ్ చేయడం, వైన్‌షాపుల్లో గౌడన్నలకు కల్పించిన రిజర్వేషన్లను బీఆర్ఎస్ ప్రతినిధులు సభ దృష్టికి తెచ్చారు. బీసీ బిల్లుకు మద్దతు ఇవ్వాలని కోరుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావులను కాంగ్రెస్ నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్సీ నవీన్ కలిసి విన్నవించారు.
బీసీ రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్ పార్టీకి మైలేజ్ కలుగుతుందనే కుత్సిత బుద్ధిని బీఆర్ఎస్ ప్రదర్శించకపోవడం పట్ల అసెంబ్లీ ప్రాంగణంలో ఆసక్తికర చర్చ సాగింది. ‘బీసీ రిజర్వేషన్ల బిల్లుపై బీఆర్ఎస్ రాజకీయాలకు అతీతంగా హుందాగా ప్రవర్తించింది’ అని కాంగ్రెస్ ప్రజాప్రతినిధి ఒకరు వ్యాఖ్యానించడం విశేషం. ఈ విషయంలో తెలంగాణ అంతా ఒక్కటే అన్న సంకేతాన్ని కేంద్రానికి ఇవ్వాలని, ఆ ప్రయత్నాల్లో తామూ భాగస్వామ్యం అవుతామని అసెంబ్లీ వేదికగా బీఆర్ఎస్ ప్రకటించింది. గతంలో అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని ఈ ప్రభుత్వం వెనక్కి తీసుకున్నా, బీఆర్ఎస్ మాట్లాడకపోవడమే ఆ పార్టీకి బీసీ పట్ల ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని బీసీ వర్గాలు పేర్కొనడం గమనార్హం.