బుధవారం 28 అక్టోబర్ 2020
Telangana - Oct 14, 2020 , 03:30:32

నాలా.. అత్యంత సులభంగా

నాలా.. అత్యంత సులభంగా

  • భూమార్పిడి సమస్యలకు చెక్‌
  • చట్ట సవరణకు అసెంబ్లీ ఆమోదం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: నాలా చట్ట సవరణ బిల్లును మంగళవారం అసెంబ్లీ ఆమోదించింది. ఈ సందర్భంగా మంత్రి వేముల మాట్లాడుతూ నాలా చట్టంలోని సంక్లిష్టతల కారణంగా ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడుతున్నారని, తాజా సవరణతో రైతులు, కొనుగోలుదారులు, బిల్డర్లకు ప్రయోజనమన్నారు. ఈ చట్టంతో ఇబ్బందులను గుర్తించిన సీఎం కేసీఆర్‌ ఇప్పటికే కన్వర్షన్‌ చార్జీలను తగ్గించారని గుర్తుచేశారు. జీహెచ్‌ఎంసీలో 5శాతం నుంచి 2 శాతానికి, ఇతర ప్రాంతాల్లో 9 శాతం నుంచి 3 శాతానికి తగ్గించారని చెప్పారు. ‘గతంలో కన్వర్షన్‌ చేయాలనుకునేవారు ఆర్డీవోకు దరఖాస్తు చేసుకొని చార్జీలను చెల్లించేవారు. ఆర్డీవో ఆ దరఖాస్తును పరిశీలించి అన్నీ సరిగా ఉంటే వారంలో అనుమతి ఇచ్చేవారు. ఒకవేళ చార్జీలు తక్కువగా కట్టారని భావిస్తే దరఖాస్తుదారుకు సమాచారం వస్తే.. వారు వారం రోజుల్లో మిగతా సొమ్ము చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వా త ఆర్డీవో ఆ దరఖాస్తును అనుమతించవచ్చు లేదా.. తిరస్కరించవచ్చు. ఈ విచక్షణాధికారం అవినీతికి, అవకతవకలకు అవకాశం కల్పిస్తున్నదని ప్రభుత్వం భావిస్తున్నది’ అని మంత్రి పేర్కొన్నారు. ప్రస్తుతం ధరణి పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ప్రాంతాలవారీగా నిర్ణయించిన ఫీజు స్పష్టం గా ఉంటుందని, ఆ మేరకు చెల్లించాలని చెప్పారు. ఈ దరఖాస్తు నేరుగా తాసిల్దార్‌ వద్దకు వెళ్తుందన్నారు. స్లాట్‌ ప్రకారం తాసిల్దార్‌ ఆఫీస్‌కు వెళ్లిన వెంటనే కన్వర్షన్‌ పూర్తవుతుందని, ఆ వెంటనే వ్యవసాయేతర ఆస్తి పాస్‌బుక్‌ను ఇస్తారని వెల్లడించారు. ఇప్పటికే వ్యవసాయ భూమిని, వ్యవసాయేతర అవసరాలకు వినియోగిస్తున్నట్టు తేలితే 50 శాతం పెనాల్టీ వేసే అవకాశముందన్నారు. ఇప్పుడు అలా  వినియోగిస్తున్నవారు 3 నెలల్లోగా దరఖాస్తు చేసుకుంటే పెనాల్టీని మినహాయిస్తామన్నారు

అందరికీ ప్రయోజనం 

రెవెన్యూ రాబడిపరంగా 2016 నుంచి ఇప్పటివరకు ప్రభుత్వానికి కన్వర్షన్‌ చార్జీల రూపంలో రూ.1,630 కోట్లు వచ్చిందన్నారు. ఆర్డీవోల దగ్గర దరఖాస్తులు ఆగిపోవడంతో ఇంకా రూ.826 కోట్లు రావాల్సి ఉన్నదన్నారు. దరఖాస్తులు ఎం దుకు ఆగిపోయాయో పర్యవేక్షించే వ్యవస్థ లేకపోవడం ఇబ్బందిగా మారిందని వివరించారు. 


logo