రామగిరి, సెప్టెంబర్ 11 : బాలికను పెండ్లి చేసుకుంటానని నమ్మించి లైంగిక దాడికి పాల్పడిన కేసులో నిందితునికి 21ఏండ్ల జైలు శిక్ష, జరిమానా విధిస్తూ గురువారం నల్లగొండ జిల్లా రెండో అదనపు న్యాయమూర్తి, ఎస్సీ, ఎస్టీ కోర్టు, పోక్సో కోర్టు న్యాయమూర్తి రోజారమణి తీర్పు వెల్లడించారు. ఎస్పీ శరత్‌చంద్రపవార్ తెలిపిన వివరాల ప్రకారం.. కట్టంగూర్ మండలం దూగినవెల్లికి చెందిన జడిగిల హరీశ్ 2018 జూలై 23న బాలికను పెండ్లి చేసుకుంటానని నమ్మించి లోబర్చుకున్నాడు.
దీంతో కట్టంగూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అనంతరం కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయగా, కేసు విచారించిన న్యాయమూర్తి దోషిగా నిర్ధారించి 20 ఏండ్ల కఠిన కారాగార శిక్ష, రూ.25 వేల జరిమానా, మరో సెక్షన్ ప్రకారం ఏడాదిపాటు జైలు శిక్ష, రూ.5 వేల జరిమానా మొత్తం కలిపి 21ఏండ్ల జైలు, రూ.30 వేల జరిమానా విధిస్తూ గురువారం తీర్పునిచ్చారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ): తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్బీ) టెలికమ్యూనికేషన్స్ డిపార్ట్మెంట్ (డీఓటీ) సహకారంతో హైదరాబాద్‌లోని చాంద్రాయణగుట్టలో చట్టవిరుద్ధంగా సిమ్‌బాక్స్ రాకెట్ నిర్వహిస్తున్న ముఠాను అరెస్టు చేసింది. ఈ సందర్భంగా ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్టు సీఎస్బీ డీజీ శిఖాగోయెల్ తెలిపారు. ‘చక్షు పోర్టల్’ ద్వారా సైబర్ మోసాలు జరుగుతున్నట్టు టెలికమ్యూనికేషన్స్ విభాగానికి ఫిర్యాదులు అందాయి.
ఈ దర్యాప్తులో అంతర్జాతీయ కాల్స్‌ను సిమ్ బాక్స్ సెటప్ ద్వారా స్థానిక నంబర్ల నుంచి ఫోన్ వచ్చినట్టు చూపిస్తూ మోసాలకు పాల్పడుతున్నారని గుర్తించారు. వెంటనే ఆ సిమ్‌బాక్స్ ఉన్న ప్రదేశాన్ని గుర్తించి ఉమ్మడి ఆపరేషన్ నిర్వహించారు. ఈ కేసులో హిదాయతుల్లా (28), అహ్మద్‌ఖాన్ (25), షేక్ షోయెబ్ (24)లను అరెస్టు చేసినట్టు శిఖాగోయెల్ తెలిపారు. కేసును దర్యాప్తు చేస్తున్నట్టు పేర్కొన్నారు.