శుక్రవారం 30 అక్టోబర్ 2020
Telangana - Oct 04, 2020 , 02:46:45

అశ్వత్థామరెడ్డి ఆటలిక సాగవు

అశ్వత్థామరెడ్డి ఆటలిక సాగవు

  • l ఎమ్మెల్సీ ఎన్నికల్లో లబ్ధికోసమే కుప్పిగంతులు 
  • l ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు  సీఎం కేసీఆర్‌తోనే పరిష్కారం
  • l థామస్‌రెడ్డిని ప్రధాన కార్యదర్శిగా ప్రకటించాలి
  • l టీఎంయూ నేతల డిమాండ్‌

సూర్యాపేట టౌన్‌: ‘స్వార్థ పూరిత ఆలోచనలతో ఆర్టీసీ ఉద్యోగులను సమ్మె బాట పట్టించిన అశ్వత్థామరెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల్లో లబ్ధిపొండానికి మరో మోసానికి పాల్పడుతున్నారు.. ఇకపై ఆర్టీసీలో ఆయన ఆటలు సాగవు’ అని తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌ (టీఎంయూ) రాష్ట్ర, ఉమ్మడి నల్లగొండ జిల్లా కమిటీ నాయకులు పేర్కొన్నారు. యూనియన్‌ రాష్ట్ర కార్యదర్శులు బీ పుల్లయ్య, బీ నరేందర్‌, జోనల్‌ సెక్రటరీ చంద్రయ్య శనివారం సూర్యాపేట జిల్లాకేంద్రంలోని జే ఫంక్షన్‌ హాల్‌లో మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌ కొండంత భరోసానివ్వడంతో ఆర్టీసీ కార్మికులంతా సమ్మెను వీడి ఆనందోత్సాహలతో విధుల్లో చేరారని తెలిపారు. కరోనా మహమ్మారి సంస్థకు పులిమీద పుట్రలా దాపురించిందని, విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలను పణంగా పెట్టి డ్యూటీలు చేస్తున్నారని పేర్కొన్నారు. కార్మికుల ఆరోగ్య పరిస్థితులు, రక్షణ చర్యలపై ఏనాడూ స్పందించని అశ్వత్థామరెడ్డి ప్రస్తు తం ఎమ్మెల్సీ ఎన్నికల వాతావరణంలో ఉద్యోగుల పట్ల మొసలి కన్నీరు కారుస్తున్నారని మండిపడ్డారు. గతంలో పలుమార్లు ఏకపక్ష నిర్ణయాలతో అటు సంస్థను, ఇటు ఉద్యోగులను ఎన్నో ఇబ్బందులు పెట్టారని ఆవేదన వ్యక్తంచేశారు. 1/17 సర్క్యులర్‌ పైనా స్పందించకపోవడాన్ని  ఖండిస్తూ.. అశ్వత్థామరెడ్డి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రధాన కార్యదర్శి బాధ్యతలను థామస్‌రెడ్డికి అప్పగించాలని ఉమ్మడి నల్లగొండ జిల్లా ఆర్టీసీ ఉద్యోగులు ఏకగ్రీవ తీర్మానం చేస్తూ టీఎంయూ పదవుల కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఉద్యోగుల పేరుచెప్పుకుని రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసమే ఈ మూడు నెలల వరకు ప్రధాన కార్యదర్శిగా కొనసాగాలని అశ్వత్థామరెడ్డి చేస్తున్న ప్రయత్నాలు మోసపూరితమని, మరోసారి ఆయన మాటలు నమ్మే పరిస్థితిలో ఉద్యోగులు లేరని స్పష్టం చేశారు. సమావేశంలో టీఎంయూ రాష్ట్ర, నల్లగొండ జిల్లా కమిటీ సభ్యులు వెంకటేశ్వర్లు, ఎస్‌ఎస్‌ గౌడ్‌, టీజే రావు, రమేశ్‌, జీ అంజయ్య, ఘని, ఏకాంబ రం, రాంబాబు, రత్నం, లింగయ్య, వేణు పాల్గొన్నారు.