ఆశ్రమ పాఠశాలల్లోని పండిట్, పీఈటీ పోస్టులను అప్గ్రేడ్ చేసి పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆయా ఉపాధ్యాయులు శనివారం లక్డీకాపూల్లోని విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర గిరిజన ఉపాధ్యాయ సమాఖ్య రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు ఇస్లావత్ లక్ష్మణ్ మాట్లాడుతూ.. ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న 378 మంది పండిట్, పీఈటీలను, జిల్లా పరిషత్ పాఠశాలల్లో పనిచేసే 610 మంది ఉపాధ్యాయులకు పీఆర్సీ సర్క్యూలర్తో ముడిపెట్టి పదోన్నతులను నిలిపివేశారని వాపోయారు. పాఠశాల ఉపాధ్యాయులను అప్గ్రేడ్ చేసి, గిరిజన సంక్షేమ పాఠశాలల్లో పనిచేసే వారికి పదోన్నతులు కల్పించకపోవడం అన్యాయమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు.