హైదరాబాద్, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ) : వాంకిడి ఆశ్రమ పాఠశాల విద్యార్థిని శైలజ మృతిపై సర్కారు ‘రోగ’ ముద్రవేసింది. గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ఇన్ఫెక్షన్ సమస్యకు ఆర్ఎంపీ సిఫారసు చేసిన సూపర్ ‘స్పెషాలిటీ’ నిర్ధారణగా స్వీకరించింది. తన తప్పు ఏమాత్రం లేదని బుకాయించే ప్రయత్నం చేస్తున్నది. శైలజ మృతికి ఫుడ్‌పాయిజన్ కారణం కాదని, ప్రభుత్వ నిర్లక్ష్యం ఏమాత్రం లేదని చెప్పే ప్రయత్నం చేస్తున్నది. కుమ్రంభీం-ఆసిఫాబాద్ అడిషనల్ కలెక్టర్ నేతృత్వంలోని బృందం వాంకిడి పాఠశాలలో గత నెల 29 నుంచి చోటుచేసుకున్న పరిణామాలపై అధ్యయనం చేసి జిల్లా కలెక్టర్‌కు ఈ నెల 12న నివేదిక ఇచ్చింది.
‘ఇంతకు ముందే గ్యాస్ట్రోఇంటెస్టినల్ ఇన్ఫెక్షన్ సమస్యతో శైలజ చికిత్స తీసుకున్నట్టు మా దృష్టికి వచ్చింది. దసరా సెలవుల్లో వైద్య పరీక్షల కోసం శైలజ అక్టోబర్ 17న మెడికల్ ల్యాబ్‌కి వెళ్లింది. మల్లికార్జున డయాగ్నస్టిక్స్ (వాంకిడి) క్లినికల్ రిపోర్ట్ ప్రకారం తెల్లరక్తకణాలు(డబ్ల్యూబీసీ) కౌంట్ స్థాయి సాధారణం కన్నా ఎక్కువగా ఉందని(14,200), ఆమెకు ఆర్ఎంపీ చంద్రశేఖర్ చికిత్స అందించి గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ఇన్ఫెక్షన్, యాంటీబయాటిక్స్ కోసం ఉపయోగించే మందులను సూచించాడు. ఆమె గత నెల 21న పాఠశాలకు వచ్చింది. అయితే అప్పటికే ఆర్ఎంపీ సూచించిన మందులు వాడుతున్నది. ఈ క్రమంలో.. అక్టోబర్ 29న కడుపునొప్పి, డయేరియా లక్షణాలతో శైలజను దవాఖానలో చేర్చాము. తల్లిదండ్రుల కోరిక మేరకు మంచిర్యాలలోని మ్యాక్స్‌కేర్ దవాఖానలో చేర్చాము. ఆ తర్వాత నిమ్స్‌లో చేర్చి అత్యాధునిక వైద్య చికిత్స అందిస్తున్నాము’ అని అడిషనల్ కలెక్టర్ బృందం కలెక్టర్‌కు నివేదిక సమర్పించింది. శైలజతోపాటు 30 మంది అమ్మాయిలకు చికిత్స అందించగా కొలుకున్నారని నివేదికలో స్పష్టంచేశారు.
దసరా సెలవుల తరువాత అక్టోబర్ 21న శైలజ పాఠశాలలో చేరిన రోజు నుంచి 29 వరకు ఎలాంటి ఆరోగ్య సమస్య రాలేదా? శైలజ అస్వస్థతకు ఆమె పూర్వ అనారోగ్యమే కారణమైతే ఆమె డయేరియా బారినపడాలి, మిగతా 29 మంది ఎందుకు దవాఖాన పాలైనట్టు? అన్న ప్రశ్నలకు సమాధానాలు దొరకడం లేదు.
శైలజ మృతదేహాన్ని వాంకిడికి తరలించే ముందు నుంచే సర్కారు అప్రమత్తమైంది. జిల్లా వ్యాప్తంగా సోమవారం అర్ధరాత్రి నుంచే పోలీసులు గట్టి బందోబస్తు చేపట్టారు. ఎమ్మెల్యే కోవ లక్ష్మిని పోలీసులు రాత్రి నుంచే గృహనిర్బంధంలో ఉంచారు. బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్‌ను అడ్డుకున్నారు. కొడంగల్ నుంచి ఆసిఫాబాద్ వరకు రేవంత్ సర్కారు అణచివేత చర్యలనే ఆశ్రయించిస్తున్నదని తెలంగాణ సమాజం నిప్పులు చెరుగుతున్నది. కొండారెడ్డిపల్లి మాజీ సర్పంచ్ సాయిరెడ్డి ఆత్మహత్యకు పాల్పడినప్పటి నుంచి గ్రామం పోలీస్ బెటాలియన్‌ను తలపిస్తున్నది.