యాదాద్రి భువనగిరి : అర్ధరాత్రి అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని లంబాడి హక్కుల పోరాట సమితి యాదాద్రి జిల్లా ప్రధాన కార్యదర్శి మూడవత్ అశోక్ నాయక్(Ashok Naik) అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడానికి వస్తున్న నేపథ్యంలో పోలీసులు అక్రమంగా అరెస్టు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని లంబాడి హక్కుల పోరాట సమితి నాయకులు ప్రశ్నించారు. ప్రశ్నించిన నేతలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో బంధించడం దారుణమన్నారు.
ఎన్నికల్లో గిరిజనులకు పోడు భూములకు పట్టాలు ఇస్తాని హామీనిచ్చారు. అదేవిధంగా యాదాద్రి పుణ్యక్షేత్రంలో బంజారాలకు ఐదు ఎకరాల్లో సద్గురు సంత్ సేవాలాల్ మహారాజ్ మందిరాన్ని, బంజారా భవనాన్ని నిర్మిస్తామని, తండాలను రెవెన్యూ గ్రామపంచాయతీగా గుర్తిస్తామని ఇలా ఎన్నో హామీలను ఇచ్చారు. తీరా గెలిచాక హమీలను గాలికి వదిలేశారు. తక్షణమే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. అలాగే అక్రమంగా అరెస్ట్ చేసిన వారిని విడుదల చేయాలన్నారు.