Asha Workers | కొల్లాపూర్ : అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఎన్నో హామీలు ఇచ్చిందని.. నేడు అధికారంలోకి వచ్చాక వాటన్నింటినీ విస్మరించిందని పలువురు ఆశ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ పట్టణంలోని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఇంటిని ముట్టడించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా పలువురు ఆశా వర్కర్లు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఆశలకు ఇచ్చిన హామీలను గుర్తు చేసేందుకు నిరసన చేపట్టినట్లు తెలిపారు. కార్యకర్తలకు ఫిక్స్డ్ వేతనంతోపాటు ప్రమాద బీమా, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే సమస్యల పరిష్కారం కోసం ఐఏఎస్ అధికారితో కమిటీ వేస్తామని చెప్పిన విధంగా వెంటనే అమలు చేయాలన్నారు. అనంతరం అక్కడున్న మంత్రి సిబ్బందికి వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఈశ్వర్, సహాయ కార్యదర్శి దశరథం, ఆశ వర్కర్స్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షురాలు శ్రీదేవి, కార్యకర్తలు పాల్గొన్నారు.