చిక్కడపల్లి, మార్చి 28: కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని శనివారం ఆశా వర్కర్లు శాంతియుతంగా తలపెట్టిన ‘చలో హైదరాబాద్’ కార్యక్రమంపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. వివిధ జిల్లాల నుంచి భారీ సంఖ్యలో వచ్చిన ఆశా కార్యకర్తలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకొని అరెస్టు చేశారు. దీంతో ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొన్నది. దాదాపు గంటపాటు ఆశా కార్యకర్తల అరెస్టులతో ఆ ప్రాంతం అట్టుడికింది. పలువురు ఆశా కార్యకర్తలకు గాయాలయ్యాయి. ములుగు జిల్లా నుంచి వచ్చన అనిత అనే ఆశావర్కర్ అస్వస్థతకు గురికాగా, గాంధీ దవాఖానకు తరలించి చికిత్స అందించారు. రేవంత్ సర్కార్ రాష్ట్రవ్యాప్తంగా ఆశాకార్యకర్తలను ఎక్కడికక్కడే అరెస్టు చేసి, పోలీస్ స్టేషన్లకు తరలించింది.
అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్‌రెడ్డి ఇచ్చిన రూ. 18 వేల కనీస వేతనం హామీని నెరవేర్చాలని, నెలల తరబడి బకాయిలను వెంటనే విడుదల చేయాలని, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ శనివారం ‘చలో హైదరాబాద్’కు ఆశా కార్యకర్తలు, భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ (బీఆర్టీయూ) పిలుపు ఇచ్చింది. ఇందిరాపార్కులోని ధర్నా చౌక్ వద్ద ధర్నా చేయడానికి సర్కార్ శుక్రవారం సాయంత్రం అనుమతి ఇచ్చి అదే రోజు రాత్రి రద్దు చేసింది. కానీ శనివారం ఉదయం ‘చలో హైదరాబాద్’ కార్యక్రమానికి ఆశా కార్యకర్తలు భారీగా నగరానికి చేరుకున్నారు. దీంతో పోలీసులు వారిని ఎక్కడికక్కడే అక్రమ అరెస్టు చేశారు. దీంతో బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షురాలు సంతోషితోపాటు ఆశా వర్కర్లు ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
‘ఇదేమీ రాజ్యం ఇదేమీ రాజ్యం.. దోపిడీ రాజ్యం దొంగల రాజ్యం’, ‘సీఎం డౌన్ డౌన్’, ‘చెట్టుమీద కొంగ.. రేవంత్ రెడ్డి దొంగ’, ‘ప్రజా పాలన కాదు.. రజాకార్ల పాలన’ అనే నినాదాలతో ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దద్దరిల్లింది. బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు యాదవ్‌ను శుక్రవారం రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన వద్ద ఉన్న సెల్‌ఫోన్ సైతం తీసుకున్నారు. మీడియతో మాట్లాడకుండా నిర్బంధించారు. శనివారం సాయంత్రం విడుదల చేశారు. ఆశావర్కర్లను అడ్డుకొని, అరెస్టులు, నిర్భందాలకు ప్రభుత్వం పాల్పడటం దారుణమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ విమర్శించారు. శనివారం ప్రభుత్వ చర్యలను ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోనే వారి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. చలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి హాజరైన మహిళలను పోలీసులు లాఠీలతో కొట్టి, గాయపర్చడాన్ని జాన్‌వెస్లీ తప్పుపట్టారు.

చిక్కడపల్లి, మార్చి 28: ఆశావర్కర్లకు ఇచ్చిన హామీలు అమలు చేయమంటే ప్రభుత్వం పోలీసులచేత అరెస్టు చేయిస్తున్నదని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి మండిపడ్డారు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో శనివారం ఆశావర్కర్లకు మద్దతుగా ధర్నా నిర్వహించారు. బీఆర్ఎస్ యువనాయకుడు ముఠా జయసింహ, ఆశావర్కర్స్ యూనియన్ అధక్షురాలు సంతోషి, బీఆర్ఎస్ నాయకులు, ఆశావర్కర్లు పెద్ద సం ఖ్యలో పాల్గొన్ని ప్రభుత్వానికి వ్యతిరేకం గా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడారు. ఇందిరాపార్కు వద్ద ధర్నాకు అనుమతి ఇచ్చినట్టే ఇచ్చి రద్దు చేయడం దారుణమని సర్కార్‌పై, అక్రమ అరెస్టులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. బీఆర్ఎస్ యువ నేత ముఠా జయసింహ మాట్లాడుతూ మోసపూరిత హామీలతో అధికారంలో వచ్చిన కాంగ్రెస్ వాటిని అమలు చేయమంటే అరెస్టులు చేస్తున్నారని విమర్శించారు. పల్లా రాజేశ్వర్‌రెడ్డిని పోలీసులు అసెంబ్లీకి తరలించి, ఆశా వర్కర్లను అరెస్టు చేశారు.