హైదరాబాద్, జనవరి 6 (నమస్తే తెలంగాణ)/చిక్కడపల్లి: రాష్ట్రంలోని ఆశ కార్యకర్తలకు, వివిధ మున్సిపాలిటీల్లో (జీహెచ్ఎంసీ మినహా) ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన పనిచేస్తున్న పబ్లిక్ హెల్త్ వర్కర్లకు, పారిశుద్ధ్య కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే ఔట్సోర్సింగ్ వారికి కూడా పీఆర్సీని వర్తింపజేస్తామని సీఎం కేసీఆర్ గతంలో హామీ ఇచ్చారు. ఈ మేరకు వారి నెలవారీ గౌరవ వేతనాలను 30 శాతం పెంచుతూ వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పట్టణాభివృద్ధిశాఖ గురువారం ఉత్తర్వులు జారీచేశాయి. 2021 జూన్ నుంచి పెరుగుదల వర్తిస్తుందని ప్రభుత్వం పేర్కొన్నది. దీంతో 22,533 మంది పబ్లిక్ హెల్త్ వర్కర్లు, 7,271 మంది పారిశుద్ధ్య కార్మికులకు లబ్ధి చేకూరనున్నది. ఆశ కార్యకర్తలకు ప్రస్తుతం వారి పనితీరును బట్టి ఇన్సెంటివ్ రూపంలో ప్రభుత్వం గరిష్ఠంగా రూ.7,500 ఇస్తున్నది. దానిని రూ.9,750కి పెంచుతూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆశ కార్యకర్తలకు గతంలో రూ.6 వేల గౌరవ వేతనం ఉండగా, ప్రభుత్వం 2018లో 30 శాతం పెంచింది. ఫలితంగా రూ.7,500కు పెరిగింది. పారితోషికం పెంపు పట్ల రాష్ట్రవ్యాప్తంగా ఆశ కార్యకర్తలు హర్షం వ్యక్తంచేస్తున్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావుకు తెలంగాణ వైద్య, ప్రజారోగ్య ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సాయిరెడ్డి, కార్యదర్శి మాండన్ సుదర్శన్ కృతజ్ఞతలు తెలిపారు. ఆశ కార్యకర్తలకు 30 శాతం జీతాలు పెంచుతూ జీవో నంబర్-1 జారీ చేసినందుకు హర్షం వ్యక్తం చేస్తూ హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలోని టీఆర్ఎస్కేవీ కార్యాలయంలో వద్ద తెలంగాణ గ్రామీణ ఆరోగ్య (ఆశ) కార్యకర్తల సంఘం (టీఆర్ఎస్కేవీ) ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్కేవీ రాష్ట్ర అధ్యక్షుడు జీ రాంబాబుయాదవ్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ కార్మికులు, ఉద్యోగుల పక్షపాతి అని కొనియాడారు. కార్యక్రమంలో టీఆర్ఎస్కేవీ రాష్ట్ర కార్యదర్శి పీ నారాయణ, కార్యదర్శి శివశంకర్, ఉపాధ్యక్షుడు మారయ్య, సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు రావుల సంతోష, ప్రధాన కార్యదర్శి బంధు కరుణ, బీ కృష్ణయ్య, అపర్ణ, ఉమాదేవి, విజయలక్ష్మి, మమత, రాధ, షియా బేగం తదితరులు పాల్గొన్నారు.