నమస్తే నెట్వర్క్, జూలై 22: ఇదేనా ప్రజాపాలన అంటూ.. కాంగ్రెస్ సర్కారు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఆశ కార్యకర్తలు సోమవారం ఆయా జిల్లాల కలెక్టరేట్ల ఎదుట ధర్నా నిర్వహించారు. ప్రజాపాలన పేరు చెప్పి గద్దెనెక్కిన కాంగ్రెస్ తమ సమస్యలను పరిష్కరించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగ భద్రతతో పాటు కనీస వేతనం రూ.18 వేలు, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఆశ కార్యకర్తల సమస్యలపై అసెంబ్లీ సమావేశాల్లో నిర్ణయం తీసుకోవాలంటూ సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ పిలుపు మేరకు కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని కలెక్టరేట్ ఆఫీసుల ఎదుట కదం తొక్కారు. కరీంనగర్లో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ముకుందరెడ్డి, జిల్లా కార్యదర్శి రమేశ్ పాల్గొన్నారు. జోగుళాంబ గద్వాల కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టి వినతిపత్రాన్ని కలెక్టర్ బీఎం సంతోష్‌కు అందజేశారు. నల్లగొండ, భువనగిరి కలెక్టరేట్ల ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో ఆశ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వీరారెడ్డి పాల్గొన్నారు.

సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు ఉచిత విద్యుత్తు అందించాలని పవర్లూమ్ వస్త్ర పరిశ్రమ, అనుబంధ పరిశ్రమల సమాఖ్య(జేఏసీ) నాయకులు జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ సమీపంలో రిలే నిరాహార దీక్ష చేపట్టారు. తమ డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చేదాకా పోరాటం ఆగదని స్పష్టం చేశారు. నిరాహార దీక్షకు మద్దతుగా మంగళవారం సిరిసిల్లలోని అంబేద్కర్ చౌరస్తాలో రాస్తారోకో, 25న సిరిసిల్ల పట్టణ బంద్, 26న చలో హైదరాబాద్ కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి కూరపాటి రమేశ్ తెలిపారు. చేనేత వస్త్ర వ్యాపార సంఘం అధ్యక్షుడు దామోదర్, పాలిస్టర్ అసోసియేషన్ అధ్యక్షుడు భాస్కర్, కాటన్ వస్త్ర ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు లక్ష్మీనారాయణ, ఆసాముల సంఘం అధ్యక్షుడు రవీందర్, డయింగ్ ఓనర్స్ అసోసియేషన్ కార్యదర్శి శ్రీనివాస్ పాల్గొన్నారు.
– సిరిసిల్ల టౌన్, జూలై 22

తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ (ఐఎఫ్టీయూ) ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా బోధన్‌లో బీడీ కార్మికులు సోమవారం ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ఎలాంటి షరతుల్లేకుండా అమలు చేయాలని, జీవనభృతిని రూ.4 వేలకు పెంచుతామన్న మాటను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. జీవనభృతి మొత్తాన్ని పెంచకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని మహిళలు హెచ్చరించారు.
– శక్కర్‌నగర్, జూలై 22

సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ మత్స్యకార్మిక సంఘం నాయకులు సోమవారం నాగర్‌కర్నూల్ జిల్లా కోడేరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా మత్స్యకార్మిక సంఘం నేత శ్రీనివాసులు మాట్లాడుతూ బీసీ-డీ గ్రూపు నుంచి బీసీ-ఏ గ్రూపునకు మార్చి మత్స్యకారులకు సముచిత స్థానం కల్పించాలన్నారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహసీల్దార్ విజయ్‌కుమార్‌కు అందజేశారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు వాకిటి ఆంజనేయులు, ఉపాధ్యక్షుడు అల్లోజీ పాల్గొన్నారు.
– కోడేరు, జూలై 22

నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలోని సుభాష్‌నగర్‌లో ప్రధాన రహదారి బురదమయంగా మారింది. వివిధ పాఠశాలలకు వెళ్లే మార్గం ఇదే కావడంతో నిత్యం పదుల సంఖ్యలో విద్యార్థులు, స్థానికులు రాకపోకలు సాగిస్తుంటారు. ఇటీవల కురిసిన వర్షాలతో రోడ్డంతా చిత్తడిగా మారింది. రహదారి ఇలా ఉన్నా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించడం లేదని సోమవారం స్థానిక బీజేపీ నాయకులు బురదలో వరి నాట్లు వేసి నిరసన తెలియజేశారు. వెంటనే మరమ్మతులు చేయడంతోపాటు సీసీగా మార్చాలని డిమాండ్ చేశారు.
– కల్వకుర్తి, జూలై 22

ఎన్నికల హామీ మేరకు వడ్డెరులను ఎస్టీ జాబితాలో చేర్చాలని, వడ్డెర కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ వ డ్డెర సంఘం, చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు శివరాత్రి అయిలమల్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. డి మాండ్లు పరిష్కరించకపోతే అసెంబ్లీ, సీఎం కార్యాలయాలను ముట్టడిస్తామ ని హెచ్చరించారు. సోమవారం సం ఘం ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ ధర్నాచౌక్ వద్ద ఒక్క రోజు నిరాహారదీక్ష చేపట్టారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గణేశ్, వైస్ చైర్మన్ దేవరాజ్ ఉన్నారు.
-చిక్కడపల్లి, జూలై 22

భువనగిరి అర్బన్, జూలై 22 : ఫీజు బకాయిలు విడుదల చేయాలని కోరుతూ భువనగిరిలో సోమవారం బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి ప్రిన్స్ చౌరస్తా వరకు ర్యాలీ తీసి, రాస్తారోకో చేశారు. బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మోదీరాందేవ్ మాట్లాడుతూ బడ్జెట్లో కొఠారి కమిషన్ చెప్పినట్లు విద్యా రంగానికి 20 శాతం నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఇవే డిమాండ్లతో సూర్యాపేట, హుజూర్‌నగర్‌లో పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో విద్యార్థులు ర్యాలీ తీసి నిరసన తెలిపారు. మిర్యాలగూడలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు.

నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తిలోని డబుల్ బెడ్రూం ఇండ్లు అప్పగించాలని లబ్ధిదారులు ఆందోళన చేపట్టారు. పట్టణంలోని యూటీఎఫ్ భవనం నుంచి పాలమూరు రోడ్డు చౌరస్తా మీదుగా డబుల్ బెడ్రూం ఇండ్ల వరకు ర్యాలీ చేపట్టి, ధర్నా చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారుల సంఘం అధ్యక్షుడు ఆంజనేయులు మాట్లాడుతూ కల్వకుర్తి శివారులోని సర్వేనంబర్ 99లో కేసీఆర్ ప్రభుత్వం 220 డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించిందన్నారు. ప్రభుత్వం మారడంతో ప్రక్రియ నిలిచిపోయిందన్నారు. కార్యక్రమంలో ఏపీ మల్లయ్య, బాల్‌రెడ్డి, కిశోర్ పాల్గొన్నారు.
– కల్వకుర్తి రూరల్, జూలై 22

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల(ఉర్దూ మీడియం)లో 485 మంది విద్యార్థులు ఉన్నారు. వీరికి గదులు సరిపోక వరండాలోనే తరగతులు నిర్వహిస్తున్నారు. అన్ని తరగతులకు కలిపి కేవలం ఆరుగురు ఉపాధ్యాయులు మాత్రమే బోధననందిస్తున్నారు. ప్రార్థనా సమయంలో స్థలం లేక, సగం మంది వరండాలో, సగం మంది చిన్నపాటి మైదానంలో నిల్చుంటున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి, సమస్యలను పరిష్కంచాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.
-స్టాఫ్ ఫొటోగ్రాఫర్, నిజామాబాద్

రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఎదుట సోమవారం ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. పెండింగ్‌లో ఉన్న రూ.730కోట్ల స్కాలర్షిప్స్, ఫీజురీయింబర్స్‌మెంట్ నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆమన్‌గల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలకు సొంత భవనం లేక చెట్ల కింద చదువులు సాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ధర్నాలో ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ అధ్యక్షుడు ప్రణయ్, కార్యదర్శి శంకర్, ఉపాధ్యక్షులు చరణ్, శివ, శ్రీకాంత్, తరంగ్, సహాయ కార్యదర్శులు శ్రీకాంత్, సంధ్య, స్టాలిన్, ఆరుణ్, విద్యార్థులు పాల్గొన్నారు.
– రంగారెడ్డి, జూలై 22(నమస్తే తెలంగాణ):

అస్తవ్యస్తంగా జరిగిన ఉపాధ్యాయుల బదిలీల ఫలితంగా ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు ప్రభుత్వ పాఠశాలలో నలుగురు టీచర్లే మిగిలారు. పదోతరగతి వరకు ఉన్నా.. పూర్తిస్థాయిలో టీచర్లు లేరు. దీంతో ఉపాధ్యాయులు కావాలంటూ విద్యార్థులు సోమవారం పాఠశాలకు తాళం వేసి, సూర్యాపేట-ఖమ్మం హైవేపై రాస్తారోకో చేపట్టారు. రెండ్రోజుల్లో టీచర్లను డిప్యూటేషన్‌పై నియమిస్తామని డీఈవో హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు.

సాగు భారమై అప్పు పెరిగింది. ఎకరన్నర అమ్మినా రుణం తీరలేదు. ఆటో నడిపినా మిత్తికే సరిపోలేదు. దీంతో నిర్మల్ జిల్లా కుభీర్ మండలం సిర్పెల్లి (హెచ్)కి చెందిన రైతు జాదవ్ మారుతి ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం ట్రాన్స్ఫార్మర్ తీగలను పట్టుకుని ప్రాణం తీసుకున్నాడు.

కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండలం చంద్రపల్లి పంచాయతీ పరిధిలోని పీకలగుండం గ్రామస్తులు మిషన్ భగీరథ నీరు రాకపోవడంతో తాగునీటికి తండ్లాడుతున్నారు. ప్రమాదకరంగా ప్రవహిస్తున్న ఎర్రవాగును దాటి, మధ్యలో ఉన్న దీవికి వెళ్లి చెలిమెల నీరు తెచ్చుకోవాల్సిన దుస్థితి నెలకొన్నది. మహిళలు ఉధృతంగా ప్రవహిస్తున్న వాగును దాటి బిందెలతో నీరు తెచ్చుకుంటున్నా అధికారులు పట్టనట్టు వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.