ఖలీల్‌వాడి, ఏప్రిల్ 12: నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ అబద్ధాలకు నిలువెత్తు నిదర్శనమని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి మండిపడ్డారు. అర్వింద్ రైతు ద్రోహి అని విమర్శించారు. తాను తీసుకొచ్చానని చెప్తున్న పసుపుబోర్డు ఎక్కడుందో చెప్పాలని శనివారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. నేమ్ ప్లేట్ నిజామాబాద్‌లో, పసుపు బోర్డు ఆఫీస్ ఢిల్లీలో ఉన్నదని ఎద్దేవా చేశారు. పదవుల కోసం రంగులు మార్చే ఊసరవెల్లి అర్వింద్.. బీజేపీ జోకర్, పొలిటికల్ బ్రోకర్ అని నిప్పులు చెరిగారు. ఎంపీగా జిల్లా అభివృద్ధికి పైసా తేలేదని మండిపడ్డారు.
తెలంగాణ ఉద్యమంలో అర్వింద్ కుటుంబం ఎక్కడ ఉన్నదని ప్రశ్నించారు. ఉద్యమ సమయంలో కాంగ్రెస్ పార్టీలో ఉండి డబ్బులు దండుకుంటూ సీమాంధ్రుల పంచన చేరి తెలంగాణ ద్రోహులుగా మిగిలిపోయిన చరిత్ర డీఎస్ కుటుంబానిదని ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డి మౌత్ స్పీకర్‌గా మారిన అర్వింద్ పదేపదే కేసీఆర్ ఫామ్‌హౌస్ గురించి మాట్లాడటం సిగ్గుచేటని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై బీజేపీ నాయకులు ఏనాడైనా పోరాడారా? అని ప్రశ్నించారు.
హెచ్‌సీయూ భూముల వ్యవహారంలో బీజేపీ ఎంపీ పాత్రపై విచారణ జరపాలని జీవన్‌రెడ్డి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పల్లకీ మోస్తున్న బీజేపీ ఎంపీలు ఒక్కరోజు కూడా తెలంగాణ కోసం ఢిల్లీలో గళమెత్తలేదని విమర్శించారు. రైతుబంధు ఇవ్వనందుకు, రుణమాఫీ పూర్తి చేయనందుకు, హైడ్రా పేరుతో ఇండ్లు కూల్చినప్పుడు, నీళ్లియ్యకుండా పంటలు ఎండబెట్టినప్పుడు, యూనివర్సిటీ అటవీ భూములను ధ్వంసం చేసినప్పుడు రాష్ట్ర బీజేపీ నేతలు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ప్రజాపాలన పేరుతో జరుగుతున్న ఆటవిక పాలనలో ఏ ఒక్క సమస్యపైనా నిలదీయలేదని, పైగా రేవంత్‌రెడ్డికి ఆప్తమిత్రుల్లా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. తెలంగాణ అస్తిత్వ పరిరక్షణకు, రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం నిరంతరం కట్టుబడి ఉన్న ఏకైక పార్టీ బీఆర్ఎస్ మాత్రమేనని స్పష్టంచేశారు.