హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ): తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి జీవితమంతా బీజేపీ దాని మాతృ సంస్థ ఆరెస్సెస్‌తోనే ముడిపడి ఉన్నదని ఎంఐఎం అధినేత సదుద్దీన్ ఒవైసీ అన్నారు. ఆయన దశాబ్దాల నుంచి హైదరాబాద్‌లో ప్రస్తుత బీజేపీ రాష్ర్టాధ్యక్షుడు కిషన్‌రెడ్డితోనే కలిసి తిరిగారని తెలిపారు. హైదరాబాద్‌లో శుక్రవారం ఆయన ఓ సమావేశంలో మాట్లాడారు. ‘అసదుద్దీన్ ఒవైసీ కుటుంబం మహారాష్ట్ర నుంచి వచ్చింది అంటున్నావ్.. నా తాత ముత్తాతలు హిందుస్తాన్లోనే పుట్టారు. నా పూర్వీకులు ఇక్కడ పుడితే నా దేశం ఇదే అనే హక్కు లేదా? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావ్ రాహుల్‌గాంధీ? తెలంగాణ కాంగ్రెస్ నేతల మాటలు వాళ్ల సొంత మాటలు కాదు.. అవి ఆరెస్సెస్ నాలుక నుంచి వచ్చిన మాటలు. రేవంత్‌రెడ్డి 1999 అసెంబ్లీ ఎన్నికల్లో కిషన్‌రెడ్డితో కలిసి పనిచేయడం నేను చూశాను. గుడిమల్కాపూర్ మార్కెట్ ఆ టైంలో కార్వాన్ మార్కెట్‌గా ఉండేది. అక్కడ రేవంత్‌రెడ్డి, కిషన్‌రెడ్డితో కలిసి పనిచేశారు. గుర్తు పెట్టుకో రేవంత్.. నీ సినిమా మొత్తం మా దగ్గర ఉన్నది. నువ్వు ముందు ఏబీవీపీలో ఉండి, అటునుంచి ఆరెస్సెస్‌లోకి వెళ్లావు. అక్కడి నుంచి బీజేపీకి వెళ్లావు. ఆరెస్సెస్వాళ్లు చంద్రుడి (చంద్రబాబు) దగ్గరికి వెళ్లమంటే, బీజేపీ నుంచి ఆయన దగ్గరికి వెళ్లావు. చంద్రుడి పని అయిపోగానే కాంగ్రెస్‌లోకి వెళ్లావు. కాంగ్రెస్ ఇలాంటి ఆరెస్సెస్వాళ్లను కలుపుకొంటున్నది’ అని మండిపడ్డారు.
ఆరెస్సెస్‌తో సంబంధం లేదని చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రమాణం చేస్తావా రేవంత్‌రెడ్డి? అని ఎమ్మెల్యే అక్బరుద్దీన్ సవాల్ విసిరారు. నగరంలోని బండ్లగూడలో సాలార్ ఏ మిల్లిత్ ఎడ్యుకేషనల్ ట్రస్టు ఆధ్వర్యంలో నిర్మించిన ఫాతితా ఒవైసీ కేజీ టు పీజీ క్యాంపస్‌ను ఆయన శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధినాయకులు సోనియా గాంధీ, రాహుల్‌గాంధీతో పాటు తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిపై మండిపడ్డారు. రాహుల్‌గాంధీ, సోనియాగాంధీ ఎక్కడ పుట్టారో చెప్పాలని సవాల్ విసిరారు. తాము హిందు, సిక్కు, కైస్త్రవులకు వ్యతిరేకం కాదని, అన్ని మతాలవారికి దారుసలాం దర్వాజాలు తెరిచే ఉంటాయని పేర్కొన్నారు.