హైదరాబాద్, జూన్ 21(నమస్తే తెలంగాణ): దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం రాష్ట్రవ్యాప్తంగా ఆధ్యాత్మిక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ నాంపల్లిలోని హజ్‌భవన్‌లో జరిగిన వేడుకలకు హోంమంత్రి మహమూద్ అలీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సిద్దిపేటలోని వెంకటేశ్వరాలయంలో జరిగిన వేడుకల్లో వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పాల్గొన్నారు.
కామారెడ్డి జిల్లా బీర్కూట్ శివారులోని తెలంగాణ తిరుమల దేవస్థానంలో నిర్వహించిన కార్యక్రమంలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, ఖమ్మంలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయం, గుడ్ షెపర్డ్ చర్చితోపాటు ఓ మసీదులో జరిగిన వేడుకల్లో రవాణాశాఖమంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, భద్రాచలం సీతారామచంద్రస్వామివారి దేవస్థానంలో నిర్వహించిన ఆధ్యాత్మిక దినోత్సవంలో ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో జరిగిన వేడుకల్లో మంత్రి కొప్పుల ఈశ్వర్-స్నేహలత దంపతులు పాల్గొన్నారు.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో నిర్వహించిన ఆధ్యాత్మిక దినోత్సవంలో మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి పాల్గొన్నారు. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఘనంగా జరిగిన ఆధ్యాత్మిక వేడుకలకు మంత్రి ఎర్రబెల్లి హాజరయ్యారు. ఆధ్యాత్మిక దినోత్సవంలో భాగం గా తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన కాళేశ్వర ముక్త్తీశ్వరస్వామి ఆలయంలో నిర్వహించిన చండీయాగంలో ఆలయ చైర్మన్ లింగంపల్లి శ్రీనివాస్ రావు, భూపాలపల్లి జడ్పీ చైర్పర్సన్ జక్కు శ్రీహర్షిణి తదితరులు పాల్గొనగా, పెద్దపల్లి జిల్లాలోని రాగినేడు నాగలింగేశ్వర ఆలయంలో జరిగిన మండల ఉత్సవంలో పోలీస్ హౌసింగ్ కార్పొరే షన్ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్తా దంపతులు హాజరై ప్రత్యేక పూజలు చేశారు.