హైదరాబాద్, జూన్ 5 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో సమయానికి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేయకపోవడంతో వర్షాలతో ధాన్యం తడిసి రంగు మారుతున్నదని, వడ్లు కూడా కొనడం చేతగాని దద్దమ్మ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ విమర్శించారు. శుక్రవారం ఆయన హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వం కోతలు పెట్టలేదని పేర్కొన్నారు. 2024-2025, 2025-2026 సంవత్సరాలకు సంబంధించి తెలంగాణ ఇంకా 36 లక్షల టన్నుల ధాన్యం కేంద్రానికి బాకీ ఉన్నదని చెప్పారు. ధాన్యం సరఫరాకు లారీల కొరత ఉన్నదని చెప్తున్నారని, ఇసుక రవాణాకు దొరుకుతున్న లారీలు ధాన్యం సరఫరాకు మాత్రం దొరుకడం లేదా? అని ప్రశ్నించారు. కేంద్రానికి ఇస్తామని చెప్తున్న వడ్లను ఇవ్వడంలేదని, ఇక్కడేమో సీఎం రేవంత్‌రెడ్డి అబద్ధాలు చెప్తున్నారని దుయ్యబట్టారు.
రేవంత్‌రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే పంజాబ్‌లో ఉన్న మార్కెటింగ్ వసతులను చూసి రావాలని హితవు పలికారు. అసలు తన ఫ్యూచరేమిటో తెలియని.. అసలు ఫ్యూచరేలేని రేవంత్‌రెడ్డి ఫ్యూచర్‌సిటీ కడ్తానని చెప్పడం విడ్డూరమని పేర్కొన్నారు. మూడు నాలుగు పార్టీలు మారిన రేవంత్‌రెడ్డి బీజేపీలోకి వస్తారన్నది ప్రచారమేనని, ఆయన ఎప్పుడూ ఏబీవీపీలో లేరని చెప్పారు. ఆయన అన్న ఏబీవీపీలో పనిచేశారని పేర్కొన్నారు. తాను ఏబీవీపీ నుంచి వచ్చానని చెప్పుకోవడం వల్లనే ప్రధాని మోదీ పిలిచి ఉంటారని, అంతకుమించిన ప్రత్యేకత లేదని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉద్యమంతో సంబంధంలేని, సోనియాగాంధీని తిట్టిన వ్యక్తిని ముఖ్యమంత్రిని చేసినందుకు కాంగ్రెస్ పార్టీ సిగ్గుపడాలని దుయ్యబట్టారు.