హైదరాబాద్, మే 19 (నమస్తే తెలంగాణ) : నిజామాబాద్ బీజేపీ ఎంపీ అర్వింద్ సొంత పార్టీ నేతల గుట్టు విప్పారు. ఇద్దరు, ముగ్గురు సీనియర్ ఆఫీస్ బేరర్లు ధర్నా చేస్తున్నట్టు నటించి పోలీసులను పిలిపించుకొని అరెస్టయ్యారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన చెప్పిన మాటలు సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘ఇద్దరు ముగ్గురు ఆఫీస్ బేరర్లను చూసిన నేను, మావోళ్లు.. కార్యకర్తలు, సీనియర్లను.
వాళ్లు ఉన్నకాడికే పోలీసులను పిలిపించుకొని కావాలనే అరెస్ట్ అయిండ్రు. ఉద్యోగాలు పోతయ్. పార్టీల సిన్సియర్‌గా పనిచేయండి. లేకపోతె ఇంట్ల కూసోండ్రి. మిమ్మల్నెవడూ రోడ్లమీదికి రా అన్లే. స్లోగన్లు ఇయ్యనీకి గాదు. వీడియోలున్నయ్.. పిలిపిచ్చుకుర్రు.. పోలీసోళ్లని. పిలిపిచ్చుకొని వాళ్లతోని ముచ్చటవెట్టుకుంట, స్లోగన్చిచ్చుకుంట కార్లలో కూసున్నరు. ఆళ్లు ఈళ్లకోసం డోర్లుదీత్తుర్రు’ అని తమ పార్టీ నాయకుల తీరును బయటపెట్టారు.