హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ): ఒక ఐడియా జీవితాన్ని మార్చేసింది. మడతపెట్టే వ్రతపీఠాన్ని తయారుచేసిన మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం కాటినగరానికి చెందిన కృష్ణమాచారిని ఆవిష్కరణలకు కేంద్రమైన టీవర్క్స్కు రప్పించింది. సత్యనారాయణ వ్రతం కోసం ఉపయోగించే పీఠాన్ని ఒకచోటి నుంచి మరో చోటుకు ఈజీగా తీసుకెళ్లేందుకు ఆయన తయారుచేసిన మడతపెట్టే వ్రతపీఠం వైరల్ అయి మంత్రి కేటీఆర్ దృష్టిలో పడింది. దీనిని చూసి ఆశ్చర్యపోయిన మంత్రి ఆయనకు చేయూత అందించేందుకు ముందుకొచ్చారు.
సరికొత్త డిజైన్లతో భౌతిక ఉత్పత్తులను తయారుచేసే వారిని గుర్తించి ప్రోత్సహించేందుకు ఏర్పాటు చేసిన టీవర్క్స్లో ఆయనకు చోటు కల్పించారు. మంత్రి కేటీఆర్ చొరవతో తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ (టీఎస్ఐసీ) ప్రతినిధులు కృష్ణమాచారిని కలిసి హైదరాబాద్లోని టీవర్క్స్కు తీసుకువచ్చారు. అక్కడి నిపుణుల బృందం చెక్కతో తయారుచేసిన సత్యనారాయణ వ్రతపీఠం పని తీరును పరిశీలించింది. దీనిని మరింత సౌకర్యవంతంగా, ఆకట్టుకునేలా రూపొందించేందుకు టీవర్క్స్లో సహకారం అందించనున్నారు.
ఆ ఇబ్బందులు
సత్యనారాయణస్వామి వ్రతం చేసే సమయంలో వ్రతపీటను తీసుకెళ్లేందుకు పడుతున్న ఇబ్బందులు చూసి ఈ ఆలోచన వచ్చింది. పీఠాన్ని ఓ బాక్సులా తయారుచేయాలన్న ఆలోచన వచ్చింది. మొత్తం టేకుతో తయారుచేసే ఈ పీఠం బరువు 25 కేజీలు ఉంటుంది.
– కృష్ణమాచారి, కార్పెంటర్