కవాడిగూడ, మార్చి 25 : విద్యుత్తు సంస్థలో పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికులను కన్వర్షన్ చేయాలని తెలంగాణ విద్యుత్తు ఆర్టిజన్స్ కన్వర్షన్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ కే ఈశ్వర్రావు, రాష్ట్ర కన్వీనర్ ఎంఏ వజీర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం జేఏసీ ఆధ్వర్యంలో ఇందిరాపార్కు వద్ద సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మా ట్లాడుతూ.. ఏడేండ్లుగా 20వేల మంది ఆర్టిజన్స్ పనిచేస్తున్నారని, వీరు అంతకుముందు విద్యుత్ సంస్థల్లోనే కాంట్రాక్ట్ పద్ధతిలోనే పనిచేశారని తెలిపారు. వీరి విద్యార్హతను బట్టి కన్వర్షన్ చేయాలని కోరారు. ఈ విషయంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు వినతి పత్రాలు సమర్పించినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. కార్మికుల కన్వర్షన్‌పై అసెంబ్లీ సమావేశాల్లోనే నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సీఐటీయూ రాష్ట్ర నాయకులు పాలడుగు భాస్కర్, జే వెంకటేశ్‌లు ఆర్టిజన్స్‌కు మద్దతు పలికారు. ఈ కార్యక్రమంలో జేఏసీ కో చైర్మన్లు జీ నాగరాజు, వీ నరేందర్, కో కన్వీనర్లు వెంకటేశ్, కృష్ణమాచారి, నాయకులు చంద్రారెడ్డి, లింగం, మురళి, రఘునాథ్‌రెడ్డి, సదానందం, రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.