హైదరాబాద్, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ): సమ్మెకు దిగిన ఆర్జిజన్ కార్మికులపై విద్యుత్తు సంస్థలు అమానవీయ చర్యలకు దిగాయి. సమ్మె అణచివేత కోసం అనుచితంగా ప్రవర్తిస్తున్నాయి. బెదిరింపులతో దారికి తెచ్చుకొనేందుకు యత్నిస్తున్నాయి. ఈ చర్యలపై తెలంగాణ విద్యుత్తు ఆర్టిజన్ ఉద్యోగుల (టీవీఏఈ) జేఏసీ తీవ్రంగా పరిగణిస్తున్నది. దీనిని చీకటి అధ్యాయంగా జేఏసీ నేతలు అభివర్ణిస్తున్నారు. ఆర్టిజన్ కార్మికులను రెగ్యులర్ ఉద్యోగులుగా గుర్తించాలన్న ప్రధాన డిమాండ్‌తో తెలంగాణ విద్యుత్తు ఆర్టిజన్ ఉద్యోగుల (టీవీఏఈ) జేఏసీ ఆధ్వర్యంలో కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె విజయవంతంగా కొనసాగుతున్నది.
ఈ సమ్మె శుక్రవారానికి మూడో రోజుకు చేరుకొన్నది. మూడోరోజు సైతం కార్మికులు తమ విధులను బహిష్కరించారు. ఎక్కడికక్కడ నిరసనలు తెలిపారు. సమ్మెలో ఉన్న కార్మికులపై విద్యుత్తు సంస్థల యాజమాన్యాలు దుర్గార్మంగా వ్యవహరిస్తున్నాయి. ఉద్యోగులకు హెల్త్ స్కీమ్‌ను టీజీ జెన్కో నిలిపివేసింది. సమ్మె చేస్తున్న కార్మికులు, వారి కుటుంబ సభ్యులకు హక్కుగా అందాల్సిన హెల్త్ స్కీమ్ క్రెడిట్ ఇవ్వరాదంటూ దవాఖాన్లను ఆదేశించింది. దీనిపై జేఏసీ నేతలు మండిపడుతున్నారు.
తెలంగాణ జెన్కోలో పనిచేస్తున్న కార్మికులపై యాజమాన్యం కక్షపూరితంగా వ్యవహరిస్తున్నది. కార్మికులను ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్టు సందేశాలు పంపించింది. శుక్రవారం తెల్లవారుజామున 3 గంటలకు ఏకంగా నోటీసులు పంపి భయభ్రాంతులకు గురిచేయడం గమనార్హం. జెన్కో యాజమాన్య తీరును నిరసిస్తూ ఉమ్మడి ఖమ్మం జిల్లా ఆర్టిజన్ కార్మికులంతా చలో కేటీపీఎస్ (కొత్తగూడెం), వరంగల్ జిల్లా కార్మికులు చలో కేటీపీపీ(భూపాలపల్లి) నిర్వహించి తీవ్ర నిరసనలు వ్యక్తంచేశారు. వేధింపులు, బెదిరింపులు ఆపకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కార్మికులందరితో ‘చలో కొత్తగూడెం’, ‘చలో భూపాలపల్లి’కి పిలుపునిస్తామని జేఏసీ నేతలు హెచ్చరించారు. కార్మికులు, వారి కుటుంబాలకు అందాల్సిన కనీస వైద్య సౌకర్యాలను నిలిపివేయడం దుర్మార్గమైన చర్యగా అభివర్ణిస్తున్నారు.
టీజీ జెన్కో డైరెక్టర్ ఎస్వీ కుమార్‌రాజా తీరుపై ఆర్టిజన్ జేఏసీ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. హెల్త్‌స్కీమ్ నిలిపివేయడం, టెర్మినేట్ చేస్తున్నామంటూ ఆదేశాలు పంపడంపై ఆగ్రహ జ్యాలలు వ్యక్తమవుతున్నాయి. కార్మికులను బెదిరించే వైఖరిని నిరసిస్తున్నారు. ఆంధ్రా అధికారి తన అక్కసునంతా తమపై వెళ్లగక్కుతున్నారని ఆరోపిస్తున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేసిన చరిత్ర గల కుమార్‌రాజా ఇప్పుడు అదే అక్కసుతో ఆర్టిజన్ల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
ఆర్టిజన్ల సమ్మెను అణచివేసే ప్రభుత్వ కుట్రలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు ఏఐటీయూసీ రాష్ట్ర సమితి కార్యదర్శి ఎస్ బాల్‌రాజ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మెడికల్ క్రెడిట్ కార్డులు, వైద్య చికిత్సల బిల్లుల రీయింబర్స్మెంట్ సౌకర్యాలు నిలిపివేయడం సరికాదని తెలిపారు. సమ్మెలో పాల్గొంటున్న వారిపై ఎస్మా చట్టం అమల్లో ఉన్నదని, శాశ్వతంగా విధుల నుంచి తొలగిస్తామని బెదిరించడం అధికారుల దివాలా కోరుతనానికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తంచేశారు. జెన్కో నోటీసులు అందుకున్న ఆర్టిజన్లు 24 గంటల్లోగా విధుల్లో చేరకుంటే ఉద్యోగాల నుంచి తొలగిస్తామని హెచ్చరించడం తీవ్ర అభ్యంతరకరమని పేర్కొన్నారు. ఒకే సంస్థలో ఒకే రకమైన పనులు చేస్తున్న ఆర్జిజన్లు అందరినీ పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఆర్టిజన్లకు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఆర్టిజన్ జేఏసీ చేపట్టిన సమ్మె శాంతియుతంగా నడుస్తున్నది. సమ్మె రెండు రోజులు విజయవంతమైంది. యాజమాన్యం వాట్సాప్ ద్వారా వార్నింగ్ నోటీసులివ్వడం సరికాదు. హెల్త్స్కీమ్ను నిలిపివేయడం సమంజసం కాదు. ఈ ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలి. మేం డబ్బులు చెల్లిస్తేనే హెల్త్‌స్కీమ్ అమలవుతున్నది. దీనిని నిలిపివేయడం అత్యంత దారుణం. బెదిరింపులు మానుకోకపోతే చలో కేటీపీఎస్, కేటీపీపీలకు పిలుపునిచ్చి, విద్యుత్తు ప్లాంట్లు ముట్టడిస్తాం. కార్మికుల తడాఖా చూపిస్తాం.
– సతీశ్‌రెడ్డి, జేఏసీ చైర్మన్