OU Engineering College | ఉస్మానియా యూనివర్సిటీ : ఇకముందు ఉస్మానియా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులకు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మిషన్ లెర్నింగ్ (ఎంఎల్), డేటా అనలిటిక్స్ రంగాలలో నైపుణ్యాలు పెంపొందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు ఏఐ లింక్ టెక్నాలజీస్ సంస్థతో ఓయూ ఇంజినీరింగ్ కళాశాల అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది. విద్యార్థులను అత్యాధునిక నైపుణ్యాలతో పరిశ్రమలకు అవసరమైన నిపుణులుగా తీర్చిదిద్దడమే ఈ ఒప్పందం లక్ష్యం. ఇరుపక్షాల నుంచి సంబంధిత అధికారులు అవగాహనా ఒప్పందంపై సోమవారం సంతకాలు చేశారు. దీని ద్వారా విద్యార్థులకు పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా సర్టిఫికెట్ ప్రోగ్రామ్‌లు, హ్యాండ్స్ ఆన్ వర్క్‌షాప్‌లు, ప్రాక్టికల్ ట్రైనింగ్ అందించనున్నారు. ఏఐ, ఎంఎల్, డేటా అనలిటిక్స్ వంటి అప్లికేషన్స్‌పై విద్యార్థులకు సంపూర్ణ అవగాహన కల్పించనున్నారు. దీనిద్వారా విద్యార్థులు సైద్ధాంతిక జ్ఞానంతో పాటు అనుభవాత్మక నైపుణ్యాన్ని సైతం పొందే అవకాశం ఉంటుందని కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ చంద్రశేఖర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ మంగు, ప్రొఫెసర్ గడ్డం మల్లేశం, ఏఐ లింక్ టెక్నాలజీస్ డైరెక్టర్ సందీప్ వోలాం, ప్రతినిధులు శుభం లాల్, పూర్వ శ్రీవాస్తవ, ప్రొఫెసర్ ఎల్ శివరామకృష్ణ, ప్రొఫెసర్ డి. రామకృష్ణ, దివాకర్ తదితరులు పాల్గొన్నారు.