Artificial Intelligence | హైదరాబాద్, జనవరి 24 (నమస్తే తెలంగాణ) : ఇంగ్లిష్ సబ్జెక్టులోనూ కృత్రిమ మేధస్సు (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) అంతర్భాగం కాబోతున్నది. అయితే ఏఐకి సంబంధించిన పరిచయం మాత్రమే ఇంటర్ పాఠ్యాంశంగా ఉంటుంది. విద్యార్థులకు ఆయా అంశంపై ప్రాథమిక పరిజ్ఞానాన్ని అందిస్తుంది. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ప్రవేశపెట్టాలని ఇంటర్‌బోర్డు నిర్ణయం తీసుకుంది.
వాస్తవానికి ఇంటర్ ఫిజిక్స్ సబ్జెక్టులో ఏఐని ప్రవేశపెట్టాలని అధికారులు భావించారు. ఫిజిక్స్‌లో అయితే కేవలం సైన్స్ విద్యార్థుల వరకే పరిమితం కావాల్సి ఉంటుందన్న ఆలోచనతో ఈ యోచనను విరమించుకున్నారు. ఏఐతోపాటు రోబోటిక్స్, మెషిన్ లెర్నింగ్ పాఠాలను సైతం పరిచయం చేయాలని భావిస్తున్నారు. ఈ మూడు అంశాలపై విద్యార్థులకు థియరీ, ప్రాక్టికల్ పరిజ్ఞానాన్ని అందించే దిశగా కసరత్తు చేస్తున్నది. ఈ నెలాఖరులోగా ఈ మూడు అంశాలను ప్రవేశపెట్టే అంశంపై నిర్ణయం తీసుకుంటామని ఓ ఉన్నతాధికారి తెలిపారు.