హైదరాబాద్, జూన్ 26 (నమస్తే తెలంగాణ): ప్రస్తుతం సాంకేతిక రంగంలో ఏఐ హవా నడుస్తున్నది. ఈ అధునాతన సాంకేతికత ద్వారా అనేక సమస్యలను సులువుగా పరిష్కరించే అవకాశం ఉంటున్నది. ఈ నేపథ్యంలో వ్యవసాయరంగంలో సంప్రదాయ వ్యవసాయ పద్ధతులను పక్కనపెట్టి.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ను అమలుచేయాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. తద్వారా సాగుతోపాటు, మార్కెటింగ్‌లో సమస్యలను పరిష్కరించాలని భావిస్తున్నది. ఈ మేరకు ఏఐ అమలుకు చర్యలు తీసుకోలని అన్నిరాష్ర్టాల వ్యవసాయశాఖ అధికారులకు సూచించింది. వ్యవసాయంలో కృత్రిమ మేథను ఉపయోగిస్తే రైతులకు భారీ ఊరట లభించడం ఖాయం. సాగులో సమస్యలకు చెక్‌పెట్టడంతోపాటు.. భవిష్యత్ మార్కెటింగ్ వ్యూహాన్ని కూడా రూపొందించుకోవచ్చు. ఉదాహరణకు… చీడపీడలు వ్యాపించిన పంటను ఫొటో తీసి సంబంధిత అధికారులకు పంపిస్తే.. వారు కృత్రిమ మేథ ద్వారా అది ఏ తెగులో గుర్తించడంతోపాటు దాని నివారణకు తీసుకోవాల్సిన చర్యలను సూచిస్తుంది. రైతులు పండించే పంటకు ఏడాది ముందునుంచే భవిష్యత్ మార్కెటింగ్ అవసరాలను అంచనా వేయనున్నది. ఏ పంటకు ఎక్కడ? ఏ మేరకు డిమాండ్ ఉంటుంది? అని అంచనా వేస్తారు. దీనికనుగుణంగా స్థానికంగా వ్యవసాయశాఖ అధికారులు రైతులను డిమాండ్ గల పంటల సాగువైపు ప్రోత్సహించడానికి అవకాశం ఉంటుంది. దీనివల్ల ఇటు రైతు తాను పండించిన పంటను దర్జాగా విక్రయించడంతో పాటు మార్కెట్లో ధరల స్థిరీకరణకు ఉపయోగపడుతుంది.
వ్యవసాయరంగంలో తన సత్తా ఏంటో చూపించిన తెలంగాణ.. దేశానికే అదర్శంగా నిలిచింది. ఇప్పుడు కేంద్రం కన్నా ముందే వ్యవసాయరంగంలో కృత్రిమ మేథ అమలుకు నిర్ణయించింది. ఇప్పటికే జయశంకర్ వర్సిటీ.. పత్తి పంట సాగులో కృత్రిమ మేథ సాంకేతికతను ఉపయోగిస్తుంది. తొలిదశలో ప్రయోగాత్మకంగా కొన్ని జిల్లాలను ఎంపిక చేసింది. అదేవిధంగా మార్కెటింగ్‌లో ఏఐ అమలుకు గతంలోనే చర్యలు చేపట్టింది. ఇందులోభాగంగానే తాజాగా మార్కెటింగ్‌కు ఉన్న పరిస్థితుల విశ్లేషణ కోసం ప్రత్యేకంగా ఒక అడిషనల్ డైరెక్టర్ పోస్టును కూడా ఏర్పాటు చేసింది.