హైదరాబాద్, జనవరి 8 (నమస్తే తెలంగాణ): ‘నా భర్త మల్లేశ్ ఆర్మీలో మాజీ అధికారి. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆయనను హత్యచేశారు. బీఆర్ఎస్లో చురుగ్గా పాల్గొంటున్నాడని, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పనిచేయలేదని కక్షగట్టి భూవివాదం పేరుతో నా భర్తను నరికి చంపారు. ముగ్గురిని అరెస్టు చేసినా ప్రధాన సూత్రదారులు గండ్రావుపల్లి సర్పంచ్ చిన్నయ్య, ఎంపీటీసీ భర్త లక్ష్మారావు, నారాయణపల్లికి చెందిన బారయ్యను పోలీసులు అరెస్టు చేయలేదు. కాంగ్రెస్ ఎమ్మెల్యే, రాజకీయ నాయకుల ప్రోద్బలంతోనే వారి జోలికి పోలీసులు వెళ్లడం లేదు. కాల్‌డాటాను పరిశీలించినా హత్యలో వారి పాత్ర తెలుస్తుంది. డీజీపీ గారూ.. మీ రైనా నాకు, నా ఇద్దరు బిడ్డలకు న్యాయం చెయ్యాలి’ అంటూ కొల్లాపూర్‌లో ఇటీవల హత్యకు గురైన మల్లేశ్ భార్య నిర్మల డీజీపీ రవిగుప్తా వద్ద కన్నీటి పర్యంతమయ్యారు. తన భర్త హత్యకు కారకులైనవారిని వెంటనే అరెస్టు చేయాలని కోరుతూ బిడ్డలు, కుటుంబసభ్యులతో కలిసి ఆమె సోమవారం డీజీపీ రవిగుప్తాను కలిసి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు ధర్మారెడ్డి, బొల్లం మల్లయ్యయాదవ్, బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్, మైనార్టీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఇంతియాజ్ పాల్గొన్నారు. తెలంగాణలో హత్యా రా జకీయాలకు తావులేదని డీజీపీ పేర్కొన్నారు. మల్లేశ్ హత్యపై సమగ్ర దర్యాప్తుకు ఆదేశాస్తామని, నిం దితులను చట్టపరంగా శిక్షిస్తామని చెప్పారు.
ముమ్మాటికీ ఇది రాజకీయ కక్ష
తన భర్త మల్లేశ్ బీఆర్ఎస్లో యాక్టివ్‌గా ఉంటూ స్థానికంగా గొర్ల పెంపకం సంఘంలో కీలకంగా పనిచేశారని, ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నాయకులు కక్ష గట్టి తన భర్తను ఈ నెల 29న దారుణంగా హత్య చేశారని నిర్మల ఆరోపించారు. డీజీపీకి వినతిపత్రం అందజేసిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తన భర్తను హత్య చేయించినోళ్లు గ్రామా ల్లో స్వేచ్ఛగా తిరుగుతున్నారని, వారిని అరెస్టు చేయాలంటూ పోలీస్స్టేషన్ల చుట్టూ తిరిగినా, రెండు రాత్రులు పోలీస్‌స్టేషన్‌లోనే జాగారం చేసినా ఉపయోగం లేదని ఆవేదన వ్యక్తంచేశారు.
రాజకీయ ఒత్తిళ్ల వల్లే పేర్లు తప్పించారు: చల్లా
కొల్లాపూర్‌కు చెందిన స్థానిక నేతల ప్రోద్బలంతోనే పోలీసులు ముగ్గురి పేర్లు తప్పించారని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆరోపించారు. సమగ్ర విచారణ చేపట్టి వారిని కూడా అరెస్టు చేస్తామని డీజీపీ హామీ ఇచ్చారని చెప్పారు. గ్రామాల్ల్లో కాంగ్రెస్ యుద్ధ వాతారణాన్ని సృష్టించిందని, బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులకు ప్రోత్సహించడం సరైంది కాదని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీ కార్యకర్తలపై దాడులు, ఆస్తుల ధ్వంసం వంటివి నిత్యం జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. హత్య జరిగితే ప్రభుత్వం నిందితులకు కొమ్ముగాయ డం దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు. ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి సీఎం ఉన్న రేవంత్‌రెడ్డి ఇట్లాంటి వాటిని ఆదిలోనే అరికట్టాలని కోరారు. మంత్రి జూపల్లి కృష్ణారావు సొంత నియోజకవర్గం లో దేశానికి సేవచేసిన జవాన్‌ను హత్య చేయడం సిగ్గుచేటని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ ప్రశాంతంగా ఉన్నదని, ఎక్కడా ఒక్క కాంగ్రెస్ కార్యకర్త కూడా ఇబ్బంది పడలేదని చెప్పారు. హత్యా రాజకీయాలను విడనాడి, శాంతిభద్రతలను కాపాడలేకపోతే దెబ్బకు దెబ్బ తీస్తామని కాంగ్రెస్ నేతలను హెచ్చరించారు.
ప్రణాళిక ప్రకారమే హత్య: సతీశ్‌రెడ్డి
నాగర్‌కర్నూల్ జిల్లాలో బీఆర్ఎస్ నేత, ఆర్మీ మాజీ ఉద్యోగి మల్లేశ్‌ను కాంగ్రెస్ పార్టీ ప్రణాళిక ప్రకారం హత్య చేసిందని రెడ్కో మాజీ చైర్మన్ వై సతీశ్‌రెడ్డి ఆరోపించారు. ఈ దారుణహత్యను అందరూ ఖండించాలని కోరుతూ ట్వీట్ చేశారు. తమ కుటుంబానికి న్యాయం జరగాలంటూ మల్లేశ్ భార్య చేస్తు న్న ఆర్తనాదాలు దేశవ్యాప్తంగా ప్రతిధ్వనించాలని, వారికి మద్దతుగా నిలువాలని విజ్ఞప్తి చేశారు.