హైదరాబాద్, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సర్వం సిద్ధంచేస్తున్నది. గ్రామ పంచాయతీ(జీపీ)లు, వార్డు స్థానాల రిజర్వేషన్లకు సంబంధించిన విధివిధానాలను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ (పీఆర్ఆర్డీ) ఇప్పటికే ఖరారు చేసింది. ఇందుకు సంబంధించిన జీవోను శనివారం విడుదల చేయనున్నట్టు అధికారులు తెలిపారు. పంచాయతీ ఎన్నికల్లో మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించకుండా కొత్తగా రిజర్వేషన్లు కల్పించాలని డెడికేటెడ్ కమిషన్ గురువారం ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిన సంగతి తెలిసిందే. డెడికేటెడ్ కమిషన్ సిఫారసులను సర్క్యులేషన్ విధానంలో రాష్ట్ర మంత్రివర్గం శుక్రవారమే ఆమోదించింది.
మంత్రుల వద్దకు ఫైళ్లను పంపించి కమిషన్ సిఫారసులను ఆమోదిస్తున్నట్టు సంతకాలు తీసుకున్నారు. గ్రామపంచాయతీలు, వార్డుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన రిజర్వేషన్ల జీవో శనివారం జారీకాగానే, అందుకు అనుగుణంగా శని, ఆదివారాల్లో రాష్ట్రంలోని 12,733 జీపీలు, 1,12,288 వార్డులకు రిజర్వేషన్లను అధికారులు ఖరారు చేయనున్నారు. వార్డు స్థానాలకు ఎంపీడీవోలు, సర్పంచ్ స్థానాలకు ఆర్డీవోలు రిజర్వేషన్లను ఖరారు చేస్తారు. అలాగే, మహిళలకు 50% రిజర్వేషన్ కోటా కింద రాజకీయ పార్టీల సమక్షంలో లాటరీ విధానంలో వారికి సగం సీట్లు కేటాయిస్తారు.
ఈ నెల 24న హైకోర్టుకు పంచాయతీ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెల్లడించాల్సి ఉన్నది. పంచాయతీ ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాయని హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం చెప్పనున్నది. ఎన్నికలకు ఏర్పాటు చేస్తున్నామని, పిటిషన్‌పై విచారణ ముగించాలని హైకోర్టుకు విజ్ఞప్తి చేయనున్నది. ఇదే క్రమంలో పంచాయతీ ఎన్నికలకు అన్ని సిద్ధం చేశామని, తమ సంసిద్ధతను వ్యక్తంచేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘానికి కూడా లేఖ రాయనున్నది. ఈ నెల 25న రాష్ట్ర క్యాబినెట్ సమావేశం జరుగనున్నది. అదేరోజు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా ఎన్నికల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నట్టు తెలిసింది. ఆ మరుసటి రోజు పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించనున్నట్టు సమాచారం. మూడు రోజుల వ్యవధితో, అన్ని జిల్లాల్లో మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించేలా షెడ్యూల్ జారీకి ఎస్ఈసీ కసరత్తు చేస్తున్నట్టు అధికారవర్గాలు వెల్లడించాయి.
రాష్ట్ర మంత్రివర్గం ఈ నెల 25న సమావేశంకానున్నది. సచివాలయంలో మంగళవారం ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరగనున్నది. స్థానిక సంస్థల ఎన్నికలతోపాటు విద్యుత్తు రంగంపై ఈ క్యాబినెట్లో ప్రధానంగా చర్చించనున్నారు. కొత్త డిస్కమ్ ఏర్పాటు, విద్యుత్తు సంస్థల ఆర్థిక పరిస్థితి, గ్రేటర్లో భూగర్భ కేబుళ్లు, విద్యుత్తు డిమాండ్‌కు అనుగుణంగా పంప్డ్ స్టోరేజీ ప్లాంట్ల ఏర్పాటు, రామగుండంలో 800 మెగావాట్ల థర్మల్‌ప్లాంట్లు, బొగ్గు ధరలు, విద్యుత్తు సంస్థల అప్పులు, నష్టాలపై ఈ సమావేశంలో చర్చించనున్నట్టు సమాచారం. ఇంధన శాఖపైనే క్యాబినెట్ ప్రత్యేక సమావేశం నేపథ్యంలో అధికారులు సమాయత్తమవుతున్నారు.