హైదరాబాద్, డిసెంబర్ 1(నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 8, 9వ తేదీల్లో ఫ్యూచర్‌సిటీ ప్రాంతంలో నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మి ట్ ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు అధికారులను ఆదేశించారు. సోమవారం సచివాలయంలో గ్లోబల్ సమ్మిట్ నిర్వహణ ఏర్పాట్లపై సమీక్షించా రు. ఈ సమ్మిట్‌లో పాల్గొనే ప్రముఖులు, దేశ, విదేశీ అతిథులకు ఆహ్వానాలు పంపించామని, వారికి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయాలని సూచించారు. రాష్ట్రంలో నిర్వహించే అతిపెద్ద సమ్మిట్‌లో అన్ని శాఖలు తమ పురోగతిని ప్రతిబింబించాలని పేర్కొన్నారు. ఈ సమ్మిట్‌లో పెద్ద ఎత్తున ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2047 సన్నాహాలపై డీజీపీ బీ శివధర్‌రెడ్డి అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.
ఉన్నతాధికారులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దిశానిర్దేశం చేశారు. ఫోరెన్సిక్ ఎవిడెన్స్ యాక్ట్‌ను ప్రవేశపెట్టడంపై ముసాయిదా సిద్ధం చేయాలని సూచించారు. గ్లోబల్ సమ్మిట్‌కు భద్రత కట్టుదిట్టం చేయాలని చెప్పారు. తెలంగాణ పోలీసులను సైబర్, ఫోరెన్సిక్ సామర్థ్యాల్లో అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడానికి రూపొందించిన రోడ్ మ్యాప్‌ను డీజీ శిఖాగోయెల్ వివరించారు. పోలీస్ రోబోటిక్స్ ఆర్గనైజేషన్‌ను స్థాపించనున్నట్టు ఈగల్ ఫోర్స్ డైరెక్టర్ సం దీప్శాండిల్య తెలిపారు. అధికారుల వృత్తి నైపుణ్యాన్ని మెరుగుపర్చడానికి భౌతిక, డిజిటల్ శిక్షణను అనుసంధానించాలని పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష బిస్త్ సూచించారు. తెలంగాణ రాష్ట్రం 2047 నాటికి ఆర్థిక అభివృద్ధి లక్ష్యాన్ని చేరుకోవడంలో పోలీస్ వ్యవస్థదే కీలక పాత్ర అని ఐజీ రమేశ్ అభిప్రాయపడ్డారు. గ్లోబల్ సమ్మిట్‌లో తెలంగాణ విద్యా విధానం ఉన్నతిని పెంచేలా విజన్ డాక్యుమెంట్ ఉండాలని టీచర్స్ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి ప్రకటనలో ప్రభుత్వాన్ని కోరారు.