యాదాద్రి, మార్చి 2: మహాకుంభ సంప్రోక్షణకు యాదాద్రి ఆలయం ముస్తాబవుతున్నది. ఈ నెల 28న స్వామివారి ప్రధానాలయ పునః ప్రారంభం కానున్న నేపథ్యంలో మిగులు పనులను పూర్తి చేసేందుకు వైటీడీఏ అధికారులు చర్యలు చేపట్టారు. ఇప్పటికే ప్రధానాలయ పనులు పూర్తికాగా, భక్తుల వసతుల కల్పనపై దృష్టిసారించారు. కలశస్థాపనకు అవసరమైన పరంజా పనులు చివరిదశకు చేరుకొన్నాయి. భూగర్భ డ్రైనేజీ పనులు పూర్తి చేసి, క్యూ కాంప్లెక్స్‌లో మరుగుదొడ్లను భక్తులకు అందుబాటులోకి తీసుకురానున్నామని ఆలయ అధికారులు తెలిపారు. కొండపై ఇప్పటికే 11 ప్ల్లాట్ ఫారాలు కలిగిన రెండు బస్ బేలు, ఆధ్యాత్మికత ఉట్టిపడేలా కమాండ్ కంట్రోల్ రూం, స్వాగత ఆర్చ్ నిర్మాణాలు తుది దశకు చేరుకొన్నాయి. భక్తులకు సకల వసతులతో క్యూ కాంప్లెక్స్‌ను తీర్చిదిద్దుతున్నారు. 4 సాధారణ, 1 వీఐపీ భక్తుల క్యూ కాంప్లెక్స్‌లు ఉండగా ఒక్కో కాంప్లెక్స్‌లో 600 మంది వేచి ఉండేలా ఏర్పాట్లు చేశారు.
126 బంగారు కలశాల స్థాపన..
యాదాద్రి ఆలయంలోని తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం పంచతల రాజగోపురాలు, పడమర సప్తతల రాజగోపురం, తూర్పు త్రితల రాజగోపురం, గర్భాలయ దివ్యవిమాన గోపురాలకు కలశ స్థాపన చేయనున్నారు. మొత్తం 126 బంగారు కలశాలను స్థాపించనున్నామని, త్వరలో పనులు చేపడతామని ఆలయ అధికారులు వెల్లడించారు