హైదరాబాద్, సెప్టెంబర్19(నమస్తే తెలంగాణ) : రాష్ట్రవ్యాప్తంగా అక్టోబర్ నుంచే పత్తి సేకరణకు ఏర్పాట్లు చేయాలని, పత్తి రైతులకు కనీస మద్దతు ధర లభించేలా చర్యలు తీసుకోవాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పత్తి ఉత్పత్తి, మారెట్ ధరల పరిస్థితి, ఎంఎస్పీ అమలు, రైతులకు చెల్లింపులు, జిన్నింగ్-ప్రాసెసింగ్ మిల్లుల ఏర్పాట్లు, రవాణా సమస్యలు, డిజిటలైజేషన్, రైతుల రిజిస్ట్రేషన్, స్థానిక కమిటీలు, ఫిర్యాదులు-పరిషారం వంటి అంశాలపై చర్చించారు.
పత్తి సేకరణలో ప్రభుత్వ సహకారం అవసరమని సీసీఐ ప్రతినిధులు కోరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పత్తి సేకరణకు ప్రభుత్వం అన్నిరకాల సహాయ సహకారాలు అందించనున్నట్టు చెప్పారు. రైతుల ప్రయోజనాల దృష్ట్యా సీసీఐ సమర్థవంతంగా కొనుగోళ్లు చేపట్టాలని ఆదేశించారు. రైతుల ఫిర్యాదుల పరిషారం కోసం టోల్‌ఫ్రీ 1800599 5779, వాట్సాప్ హెల్ప్‌లైన్ 88972 81111 నంబర్లు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. రోజువారీ క్రయవిక్రయాలను పరిశీలించేందుకు డైరెక్టరేట్‌లో కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటుచేయాలని మంత్రి సూచించారు.