హైదరాబాద్, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ) : హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27న నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు మూడు వేల బస్సులు ఏర్పాటుచేయాలని ఆ పార్టీ నాయకులు ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌కు విన్నవించారు. రావుల చంద్రశేఖర్‌రెడ్డి నేతృత్వంలో పార్టీ నేతలు గెల్లు శ్రీనివాస్‌యాదవ్, కురవ విజయ్‌కుమార్, తుంగ బాలు తదితరులు బస్‌భవన్‌లో సోమవారం ఆయనను కలిసి వినతిపత్రం అందజేశారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చే ప్రజలు, పార్టీ శ్రేణుల కోసం బస్సులు నడపాలని కోరారు. ఇందుకు అవసరమైన రూ.8 కోట్ల చెక్కును వారు ఎండీకి అందజేశారు.
రైతులకు వ్యతిరేకం కాదు ; మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య
ధర్మసాగర్, ఏప్రిల్ 7 : హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ముప్పారం, దేవునూర్పరిధిలోని ఇనుపరాతి గుట్టలకు సంబంధించిన రైతుల భూములకు తాను వ్యతిరేకం కాదని మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. హనుమకొండ జిల్లాలో ఉన్న ఏకైక అటవీ సంపదను కాపాడడమే తన లక్ష్యమన్నారు. రెవెన్యూ అధికారులు రైతులకు సంబంధించిన భూములను అటవీ సరిహద్దుకు బయట చూపించాలి కానీ ఇష్టానుసారంగా అడవి మధ్యలో ఫారెస్టు డిపార్టుమెంట్ వారు ఏర్పాటు చేసిన కందకం బయట చూపించడం సరికాదని అన్నారు. రైతుల పక్షాన పోరాడడానికి ప్రతిపక్షంగా ఎప్పుడూ సిద్ధంగానే ఉంటామని చెప్పారు. సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ జరిపి రైతులకు న్యాయం చేస్తూ, ఇటు అడవి సంపదను కాపాడాలని కోరుతున్నామని అన్నారు.