హైదరాబాద్, జూన్ 16 (నమస్తే తెలంగాణ): బీజేపీ నేతలకంటే ఎక్కువగా, కేంద్రమంత్రులతో సంబంధం లేకుండానే ఎడాపెడా కేంద్రం పెద్దలను, ప్రధానమంత్రిని కలుస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మంగళవారం విచిత్రమైన ప్రతిపాదన చేశారు. మెట్రోరైల్ రుణ సందిగ్ధం, విస్తరణపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఢిల్లీలో సమావేశం ఏర్పాటు చేయిస్తే.. తాను హాజరవుతానని ప్రకటించారు. మెట్రో రైలు స్వాధీనంపై చేతులెత్తేసిన రేవంత్‌రెడ్డి తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు నానాపాట్లు పడుతున్న విషయం తెల్సిందే. సోమవారం విలేకరుల సమావేశం పెట్టి రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన మెట్రోఫేజ్-1 స్వాధీన ప్రక్రియకు అవసరమైన నిధులు సమకూరలేదని చెప్పిన సీఎం.. తాజాగా తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునే దిశలోనే మంగళవారం రాత్రి ఓ లేఖ విడుదల చేశారు.
కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జీ కిషన్‌రెడ్డిని ఉద్దేశించి రాసిన లేఖను ముఖ్యమంత్రి కార్యాలయం మీడియాకు విడుదల చేసిం ది. ఐఆర్ఎఫ్సీ నుంచి రుణంతోపాటు మెట్రో రెండో దశ విస్తరణకు అవసరమైన ఆర్థిక సాయం అందేలా చూడాలని లేఖలో కోరారు. హైదరాబాద్‌లో మెట్రో ఫేజ్-1 ప్రైవేట్ వారి నిర్వహణలో ఉండటం, ప్రభుత్వం ఫేజ్-2 చేపట్టాలని నిర్ణయించిన నేపథ్యంలో ప్రైవేట్ నిర్వహణలో ఉన్న ఫేజ్-1ను రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహించాలని నిర్ణయించిందని, దీని కొనుగోలుకు మొత్తం రూ.15 వేల కోట్లు అవసరమని, ఈ లెక్కలను ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ మదింపు చేసి నిర్ణయించిందని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చిందని, ఆర్బీఐ ద్వారా రుణం తిరిగి చెల్లింపునకు అంగీకరించామని పేర్కొన్నారు. ఐఆర్ఎఫ్సీకి అప్‌ఫ్రంట్ ఫీజు కింద రూ.84.32 కోట్లు చెల్లించామని, ఈక్విటీ కింద రూ.1,461 కోట్లను ఎస్క్రూ ఖాతాలో జమచేశామని వెల్లడించారు. జూన్ 15న ఐఆర్ఎఫ్సీ నుంచి తొలి వాయిదా విడుదల కావాల్సి ఉండగా ఇంకా విడుదల కాలేదని, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తక్షణం జోక్యం చేసుకొని రుణం విడుదలయ్యేలా చూడాలని, మెట్రో ఫేజ్-2 ప్రాజెక్టును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరిసగం నిధులు కేటాయించి పూర్తయ్యేలా చూడాలని కోరారు. దీనికి ముందస్తు అనుమతులు ఇవ్వాలని, ఇందుకోసం కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో చర్చించాల్సిన అవసరం ఉన్నదని, ఆయనతో సమావేశం ఏర్పాటు చేయించాలని కిషన్‌రెడ్డిని సీఎం లేఖలో కోరారు.