వరంగల్, జనవరి 26(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : వచ్చే ఎన్నికల్లో తమదే అధికారం అని గొప్పలు చెప్పుకొంటున్న బీజేపీకి మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ షాక్ ఇచ్చారు. తెలంగాణలో తనకే కాదు తనలాంటి వాళ్లెంతోమందికి తల్లివేరు బీఆర్ఎస్ అని అరూరి రమేశ్ తన చర్యతో నిరూపించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రేవంత్ సర్కార్కు ముచ్చెమటలు పట్టించి, కాంగ్రెస్ పార్టీకి గట్టి గుణపాఠం చెప్పిన తర్వాత రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయనేందుకు సోమవారం నాటి ఈ పరిణామమే నిదర్శనం. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీలను ప్రజలు ఛీత్కరించుకుంటూ బీఆర్ఎస్కు చేరువవుతున్నారు. ఈ విషయాన్ని రాష్ట్రస్థాయి నుంచి గ్రామస్థాయిలో ఉన్న రాజకీయ నాయకులు గ్రహించారా అంటే జరుగుతున్న పరిణామాలు అవుననే అంటున్నాయి. బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలు, మండలకేంద్రాల్లో కాంగ్రెస్, బీజేపీల నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో గులాబీ గూటికి చేరుతున్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లా వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ బీజేపీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. బీజేపీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించటమే కాకుండా బీఆర్ఎస్ను తన ఇంటి పార్టీగా అభివర్ణించారు. తమ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయన త్వరలో బీఆర్ఎస్లో చేరబోతున్నట్టు వెల్లడించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాల్లోనే కాకుండా రాష్ట్ర రాజకీయాల్లో రమేశ్ ఉదంతం చర్చనీయాంశమైంది. బీఆర్ఎస్ నుంచి అరూరి రెండు సార్లు ఎమ్మెల్యేగా వ్యవహరించారు. అయితే, పార్లమెంట్ ఎన్నికల సమయంలో బీజేపీలో చేరి వరంగల్ ఎంపీగా పోటీచేసిన విషయం తెలిసిందే. బీజేపీలో చోటుచేసుకుంటున్న పరిణామాలు, తెలంగాణ ప్రజల్లో జాతీయ పార్టీల పట్ల నెలకొన్న అభిప్రాయాల నేపథ్యంలో రమేశ్ బీఆర్ఎస్లోనే చేరాలని నిర్ణయంచుకున్నారు. కాగా, మున్సిపల్ ఎన్నికలు సమీపించిన వేళ అరూరి రాజీనామా బీజేపీకి గట్టిషాక్ ఇచ్చినట్టే అయిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.