మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): నాగర్‌కర్నూల్ జిల్లా దోమలపెంట వద్ద ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంలో చిక్కుకున్న ఎనిమిది మందిని రక్షించేందుకు అధికార యంత్రాంగం తీవ్రప్రయత్నా లు కొనసాగిస్తున్నది. ఆదివారం తెల్లవారుజాము నుంచి సహాయ చర్యలు నిర్విరామంగా సాగుతున్నాయి. ప్రమాదం జరిగిన టన్నెల్ 14వ కిలోమీటర్‌కు సమీపంలో 13.5 కిలోమీటర్ల వద్దకు రక్షణ బృందాలు చేరుకున్నా యి. 11వ కిలోమీటర్ల వరకు లోకోట్రైన్‌లో వెళ్లిన సహాయక సిబ్బంది అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్లారు. 13.5 నుంచి 14 కిలోమీటర్ల మధ్యలో కార్మికులు చిక్కుకొని ఉంటారని సహాయ బృందాల అధికారులు భావిస్తున్నా రు. అక్కడి పరిస్థితిని అంచనా వేస్తూ సహా యక చర్యలపై నిపుణులతో చర్చిస్తున్నారు.
ఘటన స్థలానికి వెళ్లేదెలా?
టన్నెల్ కుడి, ఎడమ, పైభాగం నుంచి డ్రిల్లింగ్ చేసి, ఘటన స్థలానికి చేరుకునే సాధ్యాసాధ్యాలపై నిపుణుల సలహాలు తీసుకుంటున్నారు. టన్నెల్‌లోని మట్టి దిబ్బలను తొలగిస్తున్నారు. 1000 హార్స్పవర్ మోటర్తో నీటిని బయటకు పంపుతున్నారు. సహాయ చర్యల్లో 130 మంది ఎన్డీఆర్ఎఫ్, 24 మంది హైడ్రా, 24 మంది సైనికులు, 24 మంది సింగరేణి రె స్క్యూ టీమ్, 120 మంది ఎస్డీఆర్ఎఫ్ సి బ్బంది పాల్గొంటున్నారు. ఘటన స్థలానికి వెళ్లే దారిలో మట్టి, నీరు అడ్డుపడుతున్నా వాటిని దాటుకుంటూ ముందుకు వెళ్తున్నారు. పైకప్పు కూలిన ప్రాంతానికి 200 మీటర్ల గ్యాప్ ఏర్పడింది. చిక్కుకున్న వారిని పేర్లు పెట్టి పిలిచినప్పటికీ అటువైపు నుంచి ఎలాంటి స్పందనా రావడం లేదని చెప్తున్నారు. ఆదివారం తెల్లవారుజాము వరకు కొంతమంది మాటలు రెస్క్యూ బృందాలకు వినిపించినట్టు సమాచారం. ఇప్పుడు ఎటువంటి శబ్దాలు వినిపించడం లేదని తెలుస్తున్నది.
ప్రాణాలతో బయటపడాలని ప్రార్థనలు
సహాయ బృందాల అధికారులు టన్నెల్ బయట అంబులెన్స్‌లను సిద్ధంగా ఉంచారు. ప్రత్యేక వైద్య బృందాలను రప్పించారు. సొ రంగంలో ఆక్సిజన్ అందించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. చిక్కుకున్న తమవారు క్షేమంగా బయటపడాలని బాధిత కుటుంబసభ్యులు వేడుకుంటున్నారు. సహాయ చర్యలను మం త్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, హైడ్రా కమిషనర్ రంగనాథ్, కర్నూలు కలెక్టర్ సంతోష్, నాగర్‌కర్నూల్ ఎస్పీ వైభవ్ గైక్వాడ్, ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు.