హైదరాబాద్, నవంబర్ 13 (నమస్తేతెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా గ్రూపు -3 పరీక్షలకు 5.36 లక్షల మంది అభ్యర్థులు హాజరవుతారని, పరీక్షల నిర్వహణకు రాష్ట్రంలో 1401 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ శాంతికుమారి వెల్లడించారు. బుధవారం సచివాలయంలో గ్రూపు-3 పరీక్షల ఏర్పాట్లు, వరి, పత్తి కొనుగోళ్ల పురోగతి, కొత్త నర్సింగ్, పారామెడికల్ కాలేజీల ప్రారంభోత్సవం, సామాజిక ఆర్థిక సర్వేపై కలెక్టర్లు, ఎస్పీలు, సీపీలతో సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎస్ శాంతికుమారి మాట్లాడుతూ.. గ్రూపు-3 పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు టీజీపీఎస్సీ విస్తృత ఏర్పాట్లు చేసినట్టు వెల్లడించారు. పరీక్షలు సజావుగా, సక్రమంగా నిర్వహించేలా చూడాలని కలెక్టర్లను ఆదేశించారు. టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్‌రెడ్డి పరీక్షల నిర్వహణ ఏర్పాట్లను సీఎస్‌కు వివరించారు.
వరి ధాన్యం రాకను ప్రతిరోజూ నిశితంగా పరిశీలించాలని సీఎస్ కలెక్టర్లకు సూచించారు. ధాన్యం దిగుబడికి అనుగుణంగా కొనుగోళ్లు జరిగేలా జాగ్రత్త వహించాలని కోరారు. ఈ సీజన్లో మునుపెన్నడూ లేని విధంగా వరి దిగుబడి వస్తున్నందున క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహించి కొనుగోళ్లు వేగవంతం చేయాలని ఆదేశించారు.