హైరాబాద్, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ) : బీఎల్వోలు ఇంటింటికీ తిరుగుతూ ఓటరు జాబితాను పకడ్బందీగా ప్రక్షాళన చేస్తున్నట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈవో)సుదర్శన్‌రెడ్డి తెలిపారు. ఓటరు ముసాయిదా జాబితాను అక్టోబరు 29న, తుది జాబితాను జనవరి 6న ప్రచురిస్తామని వెల్లడించారు. గురువారం బీఆర్కేఆర్ భవన్లో ఓటరు జాబితా ప్రక్షాళనపై రూపొందించిన పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. 2025 జనవరి 1నాటికి 18 ఏండ్లు నిండినవారు తమ ఓటు హక్కుకు ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. ఓటర్లు బీఎల్వోలకు సరియైన సమాచారం ఇవ్వాలని సూచించారు. బీఎల్వోలు ఇంటికి వచ్చినప్పుడు పేరు, చిరునామా, ఫొటోపై అభ్యంతరాలు, మార్పులు, చేర్పులు ఉన్నట్లయితే వారికి చెప్పాలని సూచించారు.
ప్రజలకు చేరువగా ఉండేందుకు బీఎల్వోల ఫోన్ నంబర్లు సైతం వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతున్నట్టు తెలిపారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 3.33కోట్ల మంది ఓటర్లు ఉన్నారని, 35,356 పోలింగ్ బూతులు ఉన్నాయని సుదర్శన్‌రెడ్డి తెలిపారు. ఒక పోలింగ్ బూత్‌లో 1500 మంది కంటే ఎక్కువగా ఓటర్లు ఉంటే, మరో కొత్తపోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటుచేయాలని ఆదేశాలు ఇచ్చినట్టు వెల్లడించారు. ఇప్పటికే 70 లక్షల ఓటర్ల జాబితా పేర్లను పరిశీలించినట్టు చెప్పారు. కలెక్టర్లు, ఈఆర్వోలు, ఏఈఆర్వోలు, సూపర్వైజర్లు స్వయంగా క్షేత్రస్థాయిలో జాబితా ప్రక్షాళనను పరిశీలిస్తారని స్పష్టంచేశారు. రాష్ట్రస్థాయిలో ఏడుగురుని అధికారులను ప్రత్యేక పరిశీలకులుగా నియమించనున్నట్టు చెప్పారు.