నాంపల్లి కోర్టులు, జూన్ 20 (నమస్తే తెలంగాణ): టీఎస్పీఎస్పీ ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో బెయిల్ కోసం నిందితులు మహ్మద్ ఖాలీద్, ముదావత్ ప్రశాంత్, భూక్యా మహేశ్ దాఖలు చేసిన పిటిషన్లపై నాంపల్లి కోర్టులో మంగళవారం వాదనలు పూర్తయ్యాయి. నిందితులపై మోపిన సెక్షన్లకు, రిమాండ్ కేసు డైరీలో తెలిపిన వివరాలకు ఎలాంటి సంబం ధం లేదని వారితరఫు న్యాయవాదులు పేర్కొనడంతో సిట్ పీపీ అభ్యంతరం వ్యక్తంచేశారు. ఈ కేసులోని ప్రతి సెక్షన్ నిందితులకు వర్తిస్తుందని చెప్పారు.
సంబంధిత అనుబంధ చార్జిషీటు దాఖలు చేయాల్సి ఉన్నందున ప్రస్తుత సమయంలో బెయిల్ మంజూరు చేయరాదని విజ్ఞప్తి చేశారు. దీంతో తీర్పును బుధవారానికి వాయిదా వేసిన కోర్టు.. మరో నిందితుడు రోహిత్‌కుమార్‌కు షరతులతో బెయిల్ మంజూరు చేసిం ది. రూ.20 వేల చొప్పున ఇద్దరి పూచీకత్తులను కోర్టుకు సమర్పించాలని, సిట్ విచారణకు సహకరించాలని 12వ అదనపు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ జీ ఈశ్వరయ్య స్పష్టంచేశారు. మరో నిందితుడు సతీశ్‌కుమార్ బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసింది.