హైదరాబాద్, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ): అస్సాంలో నమోదైన కేసులో తనకు ముం దస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కాంగ్రెస్ నేత పవన్ ఖేరా దాఖలు చేసిన పిటిషన్ విచారణార్హతపై గురువారం తెలంగాణ హైకోర్టులో వాదనలు జరిగాయి. ముందస్తు బెయిలు పిటిషన్ విచారణార్హతపై తేల్చుతామని న్యాయమూర్తి జస్టిస్ కే సుజన ప్రకటించారు. పిటిషనర్ పవన్ ఖేరా ఢిల్లీలో నివాసముంటున్నారని, కేసు అస్సాంలోని గౌహతిలో నమోదైందని, ఈ నేపథ్యంలో పిటిషన్ తెలంగాణ హైకోర్టులో విచారణార్హమా కాదా అన్నది తేల్చుతామని చెప్పారు.
విచారణను శుక్రవారానికి వాయిదా వేశారు. అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ భార్య రిణికిభూయాన్ శర్మకు వేర్వేరు దేశాలకు చెందిన పాస్‌పోర్టులు ఉన్నాయని విమర్శలు చేశారంటూ వచ్చిన ఫిర్యాదు మేరకు గౌహతిలో పవన్ఖేరాపై కేసు నమోదైంది. ఈ కేసులో అరెస్టయ్యే అవకాశాలున్నాయని, ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ పవన్‌ఖేరా హైకోర్టును ఆశ్రయించారు.
ఖేరా తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మనుసింఘ్వీ, సీనియర్ న్యాయవాది రవీందర్‌రెడ్డి వాదించారు. వంద మందికిపైగా పోలీసులను పిటిషనర్ నివాసం ఉన్న ఢిల్లీకి పంపడాన్ని తీవ్రంగా పరిగణించాలని కోరారు. పిటిషనర్ భార్య ఇకడ సనత్‌నగర్ స్థానం నుంచి అసెంబ్లీకి పోటీ చేశారని కాబట్టి స్థానికంగా ఉంటున్నందున ఈ పిటిషన్‌కు విచారణార్హత ఉంటుందని చెప్పారు.
అస్సాం రాష్ట్రం తరఫున సీనియర్ న్యాయవాది దేవజిల్ పైకీ ప్రతివాదన చేస్తూ, పిటిషనర్‌పై ఉన్నది పరువు నష్టం కేసు కాదని చెప్పారు. సీఎం భార్య వద్ద పలు దేశాలకు చెందిన పాస్‌పోర్టులు, పౌరసత్వాలు ఉన్నాయన్న ఆరోపణల వెనుక కుట్ర ఉన్నదని చెప్పారు. పిటిషన్‌కు ఇక్కడ విచారణార్హత లేదని అన్నారు. కాగా, తదుపరి విచారణ శుక్రవారానికి వాయిదా పడింది.