హైదరాబాద్, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ): నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు యత్నించిన వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్న సిట్‌కు వ్యతిరేకంగా దాఖలైన వేర్వేరు వ్యాజ్యాలపై శుక్రవారం హైకోర్టులో వాదనలు జరిగాయి. భారతీయ జనసేన పార్టీ అధ్యక్షుడు తుషార్ తరఫున సీనియర్ న్యాయవాది సంజయ్, బీజేపీ తరఫున ప్రభాకర్ వాదనలు వినిపించారు.
రామచంద్రభారతి, ఇతర నిందితుల తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది మహేశ్ జెఠ్మలానీ ఢిల్లీ నుంచి ఆన్లైన్లో వాదించారు. కేసుకు సంబంధించిన వివరాలను పోలీసులు సీఎంకు ఇచ్చారని సంజయ్ చెప్పగా, ఫిర్యాదుదారుడు ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి నుంచి అంది ఉండవచ్చు కదా అని న్యాయమూర్తి జస్టిస్ విజయ్‌సేన్‌రెడ్డి ప్రశ్నించారు. సీఎం వద్ద, దర్యాప్తు అధికారి వద్ద ఒకే తరహా సమాచారం ఉన్నదని చెప్పడానికి ఆధారాలు ఏమిటని నిలదీశారు. తదుపరి విచారణను ఈ నెల 13కి వాయిదా వేశారు.