హైదరాబాద్, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ): ఫోన్ల ట్యాపింగ్ కేసులో ముందస్తు బెయిల్ కోసం ప్రధాన నిందితుడైన రిటైర్డ్ పోలీస్ ఉన్నతాధికారి, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) మాజీ చీఫ్ టీ ప్రభాకర్‌రావు దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం హైకోర్టులో వాదనలు జరిగాయి. ప్రభాకర్‌రావు వయసుతోపాటు ఆయన అనారోగ్య పరిస్థితులను, మచ్చలేని ఆయన సేవలను, గత 30 ఏండ్ల సర్వీసులో ఆయన సాధించిన పతకాలను దృష్టిలో పెట్టుకుని అరెస్టు చేకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీచేయాలని సీనియర్ న్యాయవాది నిరంజన్‌రెడ్డి వాదించారు. కేసు దర్యాప్తునకు ఆయన సహకరిస్తారని, షరతులతో కూడిన ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరారు. ఇప్పటికే ఈ కేసులో దర్యాప్తు పూర్తయిందని, పోలీసులు చార్జిషీట్ కూడా దాఖలు చేశారని గుర్తుచేశారు.
ఈ కేసులో 6వ నిందితుడు శ్రవణ్‌కుమార్‌ను అరెస్ట్ చేయకుండా సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసినందున పిటిషనర్‌కు కూడా ఉపశమనం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ప్రభాకర్‌రావు ప్రస్తుతం అమెరికాలో ఉన్నప్పటికీ దర్యాప్తు అధికారులకు సహరిస్తూనే ఉన్నారని తెలిపారు. ఫోన్ల ఇంటర్ సెషన్ డిస్ట్రక్షన్ ఏదైనా రివ్యూ కమిటీ నిర్ణయం మేరకే జరుగుతుందని, ఆ కమిటీలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ ముఖ్యకార్యదర్శి, డీజీపీ ఉంటారని పేర్కొంటూ.. ఈ కేసులో వారి వాంగ్మూలాలను ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్‌కు ఆదేశాలిచ్చినవారిని కాకుండా ఆర్ఎస్ఐ, ఎస్ఐ లాంటి అధికారుల వాంగ్మూలాలను తీసుకుని పిటిషనర్‌ను బాధ్యుడిని చేస్తున్నారని తప్పుపట్టారు. రివ్యూ కమిటీలో పిటిషనర్ సభ్యుడు కూడా కాదని, హార్డ్ డిస్ ధ్వంసంలో పిటిషనర్ పాత్ర లేదని చెప్పారు.
ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా ప్రతివాదన చేస్తూ.. వయసు, అనారోగ్య పరిస్థితులను అడ్డంపెట్టుకుని కేసు విచారణ నుంచి పిటిషనర్ తప్పించుకునేందుకు వీల్లేదని పేర్కొన్నారు. ఫోన్ల ట్యాపింగ్ కేసు నమోదవగానే ప్రభాకర్‌రావు అమెరికాకు పారిపోయారని, ఆయన పాస్‌పోర్టును రద్దు చేయడంతోపాటు రెడ్‌కార్నర్ నోటీసు జారీ చేయడంతో విధిలేక భారత్‌కు తిరిగి రాబోతున్నారని పేర్కొంటూ.. పిటిషనర్‌కు ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని కోరారు. తదుపరి విచారణను 29కి వాయిదా పడింది.