పటాన్చెరు రూరల్, డిసెంబర్ 30 : సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామికవాడ సిగాచి పరిశ్రమలో జూన్ 30న జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 54మంది మరణించిన దుర్ఘటనపై రిటైర్డ్ సైంటిస్ట్ బాబురావు వేసిన పిల్‌పై హైకోర్టులో మంగళవారం విచారణ కొనసాగింది. కంపెనీ న్యాయవాదులు తమ వాదనలో ఆ ప్రమాదం దురదృష్టకరమని, భద్రతా ప్రమాణాలు పాటించినప్పటికీ పేలుడు సంభవించిందని పేర్కొన్నారు.
మృతుల కుటుంబాలకు రూ. 42లక్షల నష్టపరిహారం చెల్లించేందుకు కంపెనీ అంగీకరించిందని వివరించారు. ప్రభుత్వం ప్రకటించిన రూ. కోటిలో మిగిలిన భాగాన్ని ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుందని కంపెనీ పేర్కొంది. దీనిపై మూడో వ్యక్తి పిల్ దాఖలు చేయడం చెల్లదని వాదించారు. ఈ కేసును న్యాయమూర్తులు బుధవారానికి వాయిదా వేశారు.